మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునురుద్ధరణ పనులను తమ సిబ్బంది యుద్ధప్రాతిపదిక చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ సీపీడీసీఎల్) పి.పుల్లారెడ్డి తెలిపారు. సర్కిల్ పరిధిలోని జిల్లాల్లో తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా దెబ్బతిన్న ప్రాంతాల్లో జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. చిలకలూరిపేట, ద్రోణాదుల, ఇడుపులపాడు, మార్టూరు, చీరాల, కారంచేడు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను తనిఖీచేశారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ.. తుపాను కారణంగా 1,893 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, ఇప్పటికే 1,584 గ్రామాల్లో పునరుద్ధరించామన్నారు. మిగిలిన 309 గ్రామాల్లో సాధ్యమై నంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. సర్కిల్ పరిధిలో జరిగిన తుపాను నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు.


