తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ఈతకు దిగి ఓ విద్యార్థి గల్లంతైన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి కథనం మేరకు.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి కె.సాయి హర్షిత్ అతని స్నేహితులు ఎన్.నేతాజీ, పి.జగదీష్, సాయి ఈత కొట్టేందుకు సీతానగరం పుష్కర ఘాట్ల వద్దకు వచ్చి రైల్వే బ్రిడ్జి కింద కృష్ణానది వరద నీటిలోకి దిగారు. అర్ధగంట తరువాత సాయి హర్షిత్ నీటిలో మునిగిపోవడాన్ని గుర్తించి మిగిలిన స్నేహితులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు కొంత మంది కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే వరద నీటిలో సాయి హర్షిత్ గల్లంతవడంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి గజ ఈతగాళ్లతో వెతికించినా ఎటువంటి ప్రయోజనం లభించలేదు. సాయిహర్షిత్ తాత సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


