10 నుంచి కార్తిక మాసోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

10 నుంచి కార్తిక మాసోత్సవాలు

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

10 నుంచి కార్తిక మాసోత్సవాలు ● దుర్గగుడిలో నిత్యం సహస్ర లింగార్చన ● విశేష పర్వదినాల్లో బిల్వార్చన ● 24న కోటి దీపోత్సవం

● దుర్గగుడిలో నిత్యం సహస్ర లింగార్చన ● విశేష పర్వదినాల్లో బిల్వార్చన ● 24న కోటి దీపోత్సవం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల పదో తేదీ నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ వైదిక కమిటీ బాధ్యులు, ఆలయ ఈఓ శీనానాయక్‌ తెలిపారు. డిసెంబర్‌ ఎనిమిదో తేదీ వరకు నిర్వహించే ఈ మాసోత్సవాల్లో మల్లేశ్వర స్వామి వారికి నిత్య అభిషేకాలు, అర్చనలు, దీపాలంకరణ సేవలు జరుగుతాయని ఈఓ పేర్కొన్నారు. తొమ్మిదో తేదీ సాయంత్రం అమ్మవారికి, మల్లేశ్వర స్వామి వారికి పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం ఆకాశదీపం వెలిగిస్తామని వెల్లడించారు. అమ్మవారి ఆలయం సమీపంలోని శ్రీనటరాజ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి ఆలయాల వద్ద ప్రతి నిత్యం ప్రదోష కాలంలో దీపాన్ని వెలిగిస్తా మని వివరించారు. ఈ నెల 13వ తేదీన నాగుల చవితిని పురస్కరించుకుని అమ్మ ఆలయ ప్రాంగ ణంలోని నటరాజస్వామి ఆలయంలో తెల్లవారు జాము నాలుగు గంటలకు అభిషేకాలు జరుగుతా యని తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రస్వామి పుట్టలో పాలు పోసే కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్‌ ఏడో తేదీ మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామికి ప్రత్యేక బిల్వార్చన, అన్నాభిషేకం జరిగిన అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. అదే నెల ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు మహా పూర్ణాహుతితో కార్తిక మాసోత్సవాలు పరిసమాప్తం అమవుతాయి.

ప్రత్యేక బిల్వార్చనలు

కార్తిక మాసం నేపథ్యంలో విశేష పర్వదినాల్లో స్వామి వారికి ప్రత్యేక బిల్వార్చన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. 16వ తేదీ సోమవారం, 20వ తేదీ శుక్రవారం ఏకాదశి, 23వ తేదీ సోమవారం, 24వ తేదీ మంగళవారం కార్తిక పౌర్ణమి, 30వ తేదీ కార్తిక సోమవారం షష్ఠి, డిసెంబర్‌ నాలుగో తేదీ శనివారం ఏకాదశి, 7వ తేదీ సోమవారం మాసశివరాత్రిన బిల్వార్చన, అన్న ప్రసాద వితరణలు నిర్వహిస్తారు.

నిత్యం సహస్ర లింగార్చన

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలతో సహస్ర లింగాలకు అభిషేకం జరుగుతుందని ఈఓ తెలిపారు. కార్తిక మాసంలో రోజూ మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన జరుగుతుందని పేర్కొన్నారు.

దీపోత్సవ సేవ

కార్తిక మాసం నెల రోజుల పాటు మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద దీపోత్సవ సేవ జరుగుతుందని ఈఓ శీనానాయక్‌ తెలిపారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు జరిపించిన అనంతరం విశేష పూజలు నిర్వహిస్తారు.

24న కోటి దీపోత్సవం

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవాన్ని నవంబర్‌ 24వ తేదీన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈమేరకు ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయ పరిసరాలు, ఘాట్‌రోడ్డు, కనకదుర్గనగర్‌, మహా మండపం పరిసరాల్లో దీపాలను వెలిగిస్తారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జ్వాలా తోరణం జరుగుతుంది.

ఆర్జిత సేవల్లో భక్తుల పాల్గొనే అవకాశం!

కార్తిక మాసంలో నిర్వహించే ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తోంది. కార్తిమాసంలో నెల రోజుల పాటు జరిగే సహస్ర లింగార్చన సేవకు రూ.5,116, ప్రత్యేక బిల్వార్చనకు రోజుకు రూ.2 వేలు, రుద్రహోమం నిత్య ఆర్జిత సేవకు రూ.1000, సహస్ర లింగార్చన ఒక రోజుకు రూ.500, ఊంజల్‌ సేవ(దీపాలంకరణ సేవ) ఒక రోజుకు రూ.50 నిర్ణయించారు. ఆయా సేవలకు టికెట్లను దేవస్థాన కౌంటర్లలో పొందొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement