వర్షాలకు జారిపడిన రిటైనింగ్‌ వాల్స్‌ | - | Sakshi
Sakshi News home page

వర్షాలకు జారిపడిన రిటైనింగ్‌ వాల్స్‌

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): మురసు తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరంలోని 52, 53 డివిజన్లలో రెండు చోట్లు ఇళ్ల ముందు ఉన్న రిటైనింగ్‌ వాల్స్‌ జారిపడ్డాయి. ఈ ప్రమాదాల్లో ఆస్తి నష్టం మినహా ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పిల్చుకున్నారు. 53వ డివిజన్‌, కొండ్రువారి కొండప్రాంతంలో మంగళవారం రాత్రి కోపెల విజయ ఇంటి ముందు రిటైనింగ్‌ వాల్‌ జారిపోయింది. పెద్ద శబ్దంతో మట్టిచరియలు, కొండరాళ్లు దొర్లుకుంటూ యరమాల నాగరాజు ఇంటిపై పడ్డాయి. ఈ శబ్దాన్ని గుర్తించిన నాగరాజు ఇంటిలోని వారు పిల్లలను తీసుకుని బయటకు పరుగు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇంట్లోని వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలిసి డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన గౌడిపేరు సుధీర్‌ బాబు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ నివసించడం ప్రమాదకరమని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రెండు ఇళ్లవారికి సూచించారు. ఈ ప్రమాదంపై రెవెన్యూ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. రానున్న కౌన్సిల్‌ సమావేశంలో రిటైనింగ్‌ వాల్స్‌ చర్చించి, ప్రమాదకరంగా ఉన్నవాటికి సంబంధించి శాశ్వత చర్యలు తీసుకునేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

52వ డివిజన్‌లో..

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 52వ డివిజన్‌ కొండ ప్రాంతంలో రిటైనింగ్‌ వాల్‌తో పాటు ఇల్లు జారిపడింది. గొల్లపాలెంగట్టు కొండ ప్రాంతంలోని జెండాచెట్టు వద్ద చక్కా వీరమ్మ, ఆమె ఇద్దరు కుమార్తెలు ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. ఏడాది క్రితం వీరమ్మ ఇంటి ముందు ఉన్న రిటైనింగ్‌ వాల్‌ జారిపోయింది. అప్పటి కార్పొరేటర్‌ బోయి సత్యబాబు ఈ సమస్యను మునిసిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం రిటైనింగ్‌ వాల్‌ పునర్ని ర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. అయితే బిల్లులు ఆలస్యం కావడంతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం మధ్యలోనే నిలిపిపోయింది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం రాత్రి సమయంలో మిగిలిన రిటైనింగ్‌ వాల్‌తో పాటు ఇంటి ముందు భాగం కూడా కూలిపోయింది. దెబ్బతిన్న ఇంటిని కార్పొరేటర్‌ బోయి సత్యబాబు, సీపీఐ నాయకులు తాడి పైడయ్య పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement