ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన లడ్డూ పోటు భవనం సెల్లార్ వర్షపు నీటితో నిండిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సెల్లార్‌లోకి సుమారు మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరింది. లడ్డూ పోటు భవనంపై కురిసిన వర్షంతో పాటు భవనం వెనుక వైపున కొండ ప్రాంతంలో కురిసిన వర్షం నీరు సైతం బయటకు వెళ్లే మార్గం లేక సెల్లార్‌లోకి చేరినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. మంగళవారం విధులకు హాజరైన ఆలయ సిబ్బంది తమ ద్విచక్ర వాహనాలను సెల్లార్‌లో నిలిపారు. మధ్యాహ్నానికి సెల్లార్‌లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో కొంత మంది సిబ్బంది ధైర్యం చేసి లోపలకు వెళ్లి తమ వాహనాలను బయటకు తెచ్చుకోగా, మరి కొన్ని వాహనాలను నీటిలో చిక్కుకుపోయాయి. బుధవారం ఉదయం వర్షం తెరిపి ఇవ్వడంతో ఇంజినీరింగ్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడుతున్నారు. అయితే బుధవారం సాయంత్రం మరో మారు వర్షం పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నూతన లడ్డూ పోటు నిర్మాణ సమయంలోనే దేవదాయ శాఖ కమిషనర్ రామ చంద్రమోహన్ లడ్డూపోటు భవన పనులను పరిశీలించారు. ఆయన పదే పదే డ్రెయినేజీ వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. దసరా ఉత్సవాలకు ముందు హడావుడిగా పనులు చేపట్టడం, ఇంజినీరింగ్ విభాగంలో సిబ్బందికి సరైన అవగహన లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరో వైపున నూతన లడ్డూపోటు సెల్లార్‌లోకి వర్షం నీరు చేరిన విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్‌కు కొంతమంది సిబ్బంది చేరవేసినట్లు సమాచారం.


