ఎ.కొండూరు: మండలంలోని పోలిశెట్టిపాడు గ్రామంలో అసైన్డ్ భూములను ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి, ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాసం రవి కుమార్, మురళి ఆరోపిస్తున్నారు. ఆ భూమిని మెరక చేసేందుకు స్థానికి ఎర్ర చెరువు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా 3500 ట్రిప్పుల మట్టిని సైతం తోలారని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు చేశారు. ఈ మేరకు గురువారం తిరువూరు వచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశను కలిసి బాధితులు అర్జీ ఇచ్చారు. వివరాలు ఇవి.. నిరుపేదల దళిత రైతులకు పోలిశెట్టిపాడులో 225 సర్వే నంబర్లో కేటాయించిన 93 సెంట్ల అసైన్డ్ భూములను బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి తక్కువ ధరలకు స్వాధీనం చేసుకున్నారు. పక్కనే ఉన్న ఇతర రైతుల భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి వ్యవసాయ భూములకు ప్రహరీ నిర్మిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే.. తన వద్ద ఉన్న లైసెన్స్డ్ ఆయుధాన్ని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఈ అక్రమాలపై రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి విచారణ జరిపి రైతుల భూములకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదు చేసిన బాధితులు


