గన్నవరం: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి స్వదేశానికి తిరిగివచ్చిన ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖకు గన్నవరం విమానాశ్రయంలో సోమవారం ఘన స్వాగతం లభించింది. తొలుత ఆమె జపాన్ నుంచి న్యూఢిల్లీ మీదుగా ఎయిరిండియా విమానంలో ఉదయం గన్నవరానికి చేరుకున్నారు. జపాన్‌లోని ఐచి–నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకాన్ని కై వసం చేసుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు పలువురు క్రీడాభిమానులు, అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన ఏకై క భారతీయ మహిళా ఆర్చర్‌గా చరిత్ర సృష్టించిన ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జ్యోతి సురేఖ మాట్లాడుతూ తన విజయం వెనుక నిరంతర కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందన్నారు. రాబోయే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన తదుపరి లక్ష్యమన్నారు.
పోలీస్ టీంలోకి నైనా, లక్కీ
శిక్షణ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ కమిషనరేట్‌కు చేరిన రెండు శునకాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేలుడు పదార్ధాలను గుర్తించడంలో ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ పొందిన డచ్ షెఫర్డ్ జాతికి చెందిన నైనా, మాదక ద్రవ్యాలను గుర్తించడంలో ఏడాది పాటు నైపుణ్యం పొందిన బెల్జియం మెలనోయిస్ జాతికి చెందిన లక్కీ ఇక నుంచి ఎన్టీఆర్ కమిషనరేట్‌లో సేవలు అందించనున్నాయి. ప్రత్యేక శిక్షణ పొందిన రెండు స్నిఫ్నర్ డాగ్స్ నైనా, లక్కీలను హ్యాండ్లర్స్ నాగరాజు, రాజు, రామరాజు సోమవారం పోలీస్ కమిషనరేట్‌కు తీసుకు వచ్చి, కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబుకు వాటి నైపుణ్యాలను వివరించారు. శిక్షణ కాలంలోనే నైనా రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన వైనాన్ని తెలియజేశారు. నైనా, లక్కీలతో పాటు ఈగల్ టీమ్‌కు కేటాయించిన బెల్జియన్ మెలనోయిస్ జాతికి చెందిన మేల్ డాగ్ రాడోను కమిషనరేట్‌కు తీసుకువచ్చారు. ఇది కూడా మాదక ద్రవ్యాల గుర్తింపులో ఏడాది శిక్షణ పొందింది. కార్యక్రమంలో డీసీపీలు కేజీవీ సరిత, లక్ష్మీనారాయణ, ఏఆర్ డీసీపీ సత్యనారాయణ పాల్గొన్నారు.
రేపటి నుంచి కృష్ణా వర్సిటీ మహిళా చెస్ జట్టు ఎంపికలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినుల కోసం ఈ నెల 7, 8 తేదీల్లో అంతర కళాశాలల మహిళా చెస్ చాంపియన్‌షిప్ కమ్ యూనివర్సిటీ జట్టు ఎంపికలను నగరంలోని తమ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు సప్తగిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.రఘురామ్ ఓ ప్రకటనలో తెలిపారు. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, టెన్త్, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతా పత్రాలు, ఆధార్ కార్డు, అపార్ ఐడీ జిరాక్స్ పత్రాలపై వారు చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్‌తో అటెస్ట్ చేయించి అర్హతా పత్రాలతో పాటు సమర్పించాలన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థినులు వారి కళాశాల టీమ్ మేనేజర్ (ఫిజికల్ డైరెక్టర్ లేదా ఏదైనా సబ్జెక్ట్ లెక్చరర్)తో హాజరుకావాలని, ఇతరుల తోడు లేకుండా వచ్చే ఆటగాళ్లకు పోటీల్లో పాల్గొనే అవకాశం లేదన్నారు. 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని, వివరాలకు 90322 47932 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.
మంగళగిరిటౌన్: రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంగళగిరి పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేకంగా వరుణ హోమం, వరుణ జపం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయంలో ఉదయం 6.45 గంటలకు వరుణ హోమం, వరుణ జపం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


