రైతుల గుండెల్లో తుపాను భయం తుపాను హెచ్చరికలపై ఆందోళన చెందుతున్న ప్రజానీకం
అర్నబ్
హంసలదీవి వద్ద ఎగసిపడుతున్న అలలు
కంకిపాడు/చిలకలపూడి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాను ‘అర్నబ్’గా మారడంతో ఉమ్మడి కృష్ణా జిల్లావాసులు కలవరపడుతున్నారు. రైతన్న ఆందోళన చెందుతున్నాడు. పంట చేతికొచ్చే దశలో తుపాను భయంతో రైతులకు కంటిపై కునుకు కరువైంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. గిలకలదిండి కొత్తజెట్టికి బోట్లు చేరాయి.
పంటలపై తీవ్ర ప్రభావం
తుపాను తీవ్రత ఈ దఫా పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.61 లక్షల హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేపట్టారు. దివిసీమ మినహా మిగిలిన ప్రాంతాల్లో వరి పొలాలు కంకులు, చిరుపొట్ట దశల్లో ఉన్నాయి. ఎకరాకు రైతాంగం రూ.30 వేలు వరకూ పెట్టుబడులు పెట్టారు. ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి లభ్యత లేక, వర్షాభావ పరిస్థితులను తట్టుకుని రైతులు వరి సాగు చేపట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట మరో 20 రోజులు నుంచి నెల రోజుల్లో చేతికి అందే పరిస్థితి. ఈ తరుణంలో తుపాను హెచ్చరిక రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట ఎక్కడ చేతికి దక్కకుండా పోతుందోనన్న భయంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
రైతుల్లో ఆందోళన
జిల్లా వ్యాప్తంగా 18,500 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. ప్రధానంగా కూరగాయలు, అరటి, బొప్పాయి, తమలపాకు, పసుపు, ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు పంటపై పెట్టుబడులు పెట్టారు. అరటి, బొప్పాయి, తమలపాకు, కూరగాయలు పంటల ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నాయి. పసుపు దుంప ఊరే స్థితిలో ఉంది. ఈ దశలో తుపాను విరుచుకుపడితే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని ఉద్యాన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అంతటా అధికారులు పర్యటించి రైతులను అప్రమత్తం చేస్తున్నారు. తుపాను ప్రభావం చూపితే సుమారు 5200 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు ప్రాథమిక అంచనాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కృష్ణాలో..
ృష్ణా జిల్లాలో 225 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 125 పునరావాస కేంద్రాల్లో ప్రజలను తీసుకువచ్చేందుకు అన్ని సదుపాయాలు కల్పించగా మరో 100 పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి వరకు ఈ పునరావాస కేంద్రాల్లో 2,925 మందికి ఆశ్రయం కల్పించినట్లు డీఆర్వో కె శ్రీధర్‌రెడ్డి తెలిపారు. తుపాను తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మచిలీపట్నం పోర్టులో 8వ నంబరు ప్రమాద హెచ్చరిక చేసినట్లు రాడార్ అధికారులు వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు
గాంధీనగర్: తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. మంగళవారం ఆర్నాబ్ తుపాను ప్రభావంపై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో మాట్లాడారు. కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ సేవలందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ డివిజన్ (75690 08425), తిరువూరు డివిజన్ (08673–251235), నందిగామ డివిజన్ (78930 53534)లోనూ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
● తుపాను కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.


