కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ)లో తీసుకొచ్చిన సవరణలు పేదలకు, సామాజిక సేవా సంస్థలకు పెను ముప్పుగా మారాయని డీఎంకే రాజ్యసభ సభ్యుడు, జేపీసీ సభ్యుడు పి.విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో నేషనల్ అలయన్స్ ఆఫ్ సివిల్ సొసైటీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డీబీఎఫ్ వ్యవస్థాపకుడు కొరివి వినయ్‌కుమార్ అధ్యక్షతన ఆదివారం సమాలోచన సమావేశం జరిగింది. ముఖ్య అతిథి విల్సన్ మాట్లాడుతూ.. ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ లేదా సర్టిఫికెట్ రద్దయితే ఆయా సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పబ్లిక్ వేలం ద్వారా విక్రయించడం లేదా ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేసేలా నిబంధనలు తీసుకురావడం దారుణమన్నారు.
సేవా కార్యక్రమాలకు విఘాతం
విదేశీ నిధులతో ఏర్పాటైన ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో నడుస్తున్న ఉచిత సేవా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఆదికిరణ్, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, అంబటి రామకృష్ణ, అంగడాల పూర్ణచంద్రరావు, సామ్యూల్ పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు విల్సన్


