కృష్ణలంక (విజయవాడ తూర్పు): నిరంతర ఐక్య పోరాటాల ద్వారానే బీసీలకు రాజ్యాధికారం, హక్కుల సాధన సాధ్యమవుతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. విజయవాడలో బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ యూనిక్ కోడ్‌ను తప్పనిసరిగా చేర్చాలనే అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. 1871 నుంచి 1931 వరకు సాగిన జనగణనలో ఓబీసీ వివరాలు సేకరించారని, స్వాతంత్య్రం వచ్చాక ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీస్తున్నప్పటికీ ఓబీసీల వివరాలు సేకరించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికీ 1931 జనాభా లెక్కల ఆధారంగానే ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తుండటం సరికాదన్నారు. రాబోయే 2027 జనాభా లెక్కల్లో ఓబీసీలకు యూనిక్ కోడ్‌ను తప్పనిసరిగా పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అక్టోబర్ 15న మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిరసనలు తెలిపి ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్, మాజీ డీజీపీ జె.పూర్ణచందర్రావు, మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ యాదవ్, డాక్టర్ అలా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


