న్యూస్‌రీల్
విజయవాడ పోలీసుల పంట పండిస్తున్న సెటిల్‌మెంట్స్!
సెటిల్‌మెంట్లకు అడ్డాగా..
ఇలా పోలీసుల వేధింపులను బయటకు వచ్చి చెప్పలేని బాధితులెందరో ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ సెటిల్‌మెంట్స్ డెన్‌గా మారింది. సివిల్ వివాదాల్లో సైతం జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ, అమాయకుల్ని నిలువునా దోపిడీ చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకే కాక, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. గతంలో పటమట సివిల్ సెటిల్‌మెంట్ల డెన్‌గా మారిందని హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా ఆ అధికారుల తీరు మారలేదు. మరోవైపు ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేదు.
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని దండుకుంటున్న కొందరు పోలీసులు కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టని వైనం అడిగినంత ఇవ్వకుంటే స్టేషన్‌లకు పిలిపించి వేధింపులు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు బెజవాడలో భద్రత లేదని హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్
ఇవే నిదర్శనాలు..
మరో సాయికృష్ణలా కాకుండా కాపాడండి..
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన సౌజన్య హైదరాబాద్‌తో పాటు, విజయవాడలో రెండున్నరేళ్ల కిందట ఫ్లయింగ్ బోర్డర్స్ పేరుతో కన్సల్టెన్సీ పెట్టింది. నాలుగు దేశాల్లోని యూనివర్సిటీలకు విద్యార్థులను పంపిస్తుంటానని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఈ తరుణంలో ఒక మహిళ వచ్చి అడ్మిషన్ కావాలని, అడిగిందని, ప్రాసె సింగ్ దశలో ఉన్న సమయంలో బ్లాక్ మెయిలింగ్ చేయడం ప్రారంభించినట్లు సౌజన్య వెల్లడించింది. అదే సమయంలో విజయవాడలో ఓ కీలక విభాగంలో పనిచేసే ఏసీపీ ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇవ్వకుంటే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. విజయవాడలో అయితే భద్రత ఉండదని హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టానని, తనను మరో సాయికృష్ణలా కాకుండా చూడాలని ఆమె వేడుకుంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్, విజయవాడ: కంచే చేను మేసిందన్న చందంగా.. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ, తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా వారు చెప్పినట్లు వినక పోయినా, అడిగినంత ఇచ్చుకోలేక పోయినా వారి వేధింపులకు అంతే లేకుండా పోతోంది. కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని లెక్కచేయకుండా, ఇది ‘మా అడ్డా.. మేము చెప్పిందే లెక్క’ అనే రీతిలో వ్యవహరించడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. కొన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్‌మెంట్స్ అవుతుండగా.. మరికొందరు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి వారిని వేధిస్తున్న వైనాన్ని వివరిస్తున్నారు.
పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సామాజికవేత్త కొల్లూరు వెంకటేశ్వరరావు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ పటమట ప్రాంతంలోని ఓ జోనల్ స్థాయి అధికారి అవినీతిని వివరించారు. రామలింగేశ్వరనగర్‌లో చీట్లు వేసి ఎగవేసిన వారి నుంచి.. ఒక కేసు మాఫీ చేసేందుకు లాయర్ నుంచి, అపోలో ఫార్మశీపై ఎఫ్‌ఐఆర్ చేసేందుకు, పటమటలో రజకుడు మర్డర్ కేసును మాఫీ చేసేందుకు.. ఇలా అనేక సివిల్, క్రిమినల్ కేసుల్లో ఎన్ని లక్షలు వసూలు చేశారో ఆ ప్రెస్‌మీట్‌లో కూలంకషంగా వివరించారు.
ప్రైవేట్ ఆస్తి వివాదంలో జోక్యం చేసుకుంటూ పోలీసు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏసీపీ దామోదర్‌పై న్యాయవాది సత్యశ్రీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని, డెహ్రాడూన్ నుంచి ఫోన్‌లో ఫిర్యాదు ఇచ్చారని కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. విజయవాడలో తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తికి సంబంధించి, ప్రహరీ మరమ్మతుల సందర్భంగా పొరుగువారితో వివాదం తలెత్తిందని, ఆ సమయంలో పోలీసులకు తమ టైటిల్ డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించినప్పటికీ వారి జోక్యం కొనసాగిందన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించగా, 21 నవంబర్ 2025న ‘పోలీసులు జోక్యం చేసుకోవద్దు’ అని కోర్టు ఆదేశించినా వారి వేధింపులు ఆగలేదని వివరించారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జోక్యం చేసుకుని పోలీసు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
విశాఖపట్నంకు చెందిన ఇడుపులపాటి మాధవి.. తాము 2014లో విశాఖపట్నం జిల్లాలోనే 50 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశామని, దానికి 2021–22 మధ్య రైతులు అందరూ రిజిస్ట్రేషన్ కూడా చేశారన్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో హైదరాబాద్‌కు చెందిన కొన్ని కంపె నీలతో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నారు. అయితే ఈ భూమికి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తితో కేసు పెట్టించి.. మహిళ అని కూడా చూడకుండా పటమట పోలీసులు అరెస్టు చేయాలని చూశారన్నారు. అది డెప్యూటీ సీఎం బినామీ భూమి అని, 15 రోజుల్లో అప్పగించకుంటే ‘మీ అంతు చూస్తాం’ అంటూ ఏసీపీ స్థాయి అధికారి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. దీనిపై తాము హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నప్పటికీ వేధింపులు ఆగలేదన్నారు. ‘మా ఇద్దరు ఆడపిల్లలతో కలిపి లాక్కొని పోతాం. ఎవడొస్తాడో చూస్తామంటూ బెదిరించారు’ అని ఆ మహిళ సాక్షాత్తూ రాష్ట్ర డెప్యూటీ సీఎంకు లేఖ రాసింది.
హైదరాబాద్‌లో చిట్టీల వ్యాపారం చేసి నష్టపోయిన నెల్లూరు వాసు, విజయవాడ వచ్చి జీవనం సాగిస్తూ, తమ వ్యాపార భాగస్వామికి ఇవ్వాల్సిన అప్పునకు గాను, కొన్ని స్థిరాస్తులు రాసిచ్చారు. అయినప్పటికీ బలవంతంగా వాసు భార్య గీత నగదులను ప్రైవేటు సంస్థలో పృథ్వీ తాకట్టు పెట్టించగా, అప్పట్లో పోలీసులు వాటిని రికవరీ చేసి ఇప్పించారు. కాగా అలా ఇప్పించిన బంగారాన్ని మళ్లీ తిరిగి ఇవ్వాలంటూ ఏసీపీ దామోదర్ ఒత్తిడి చేస్తున్నారంటూ ఈ నెల 18న పటమట పోలీస్‌స్టేషన్ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.


