సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బుడమేరుకు వరద ఉద్ధృతి పెరిగింది. మునేరు పొంగిపొర్లగా.. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఎప్పటిలాగే విజయవాడ నగరం రోడ్లు వర్షపునీటితో పొంగిపొర్లాయి. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి డ్రెయిన్ల నిర్వహణ విషయంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపించింది. మొగల్రాజపురం, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఆటోనగర్, ఎన్టీఆర్ కూడలి, బెంజిసర్కిల్, నిర్మలా కాన్వెంట్ రోడ్లపై భారీగా నీరు చేరి నదులను తలపించాయి. ముఖ్యంగా ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ కాలనీలో పలు ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పంటల నష్టం ఇలా..
● కృష్ణాజిల్లాలో గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, పెదపారుపూడి, నందివాడ, మొవ్వ మండలాల్లో వరిసాగు 2,500 హెక్టార్లలో నష్టం జరిగింది. బాపులపాడు, గన్నవరం మండలాల్లో 135 హెక్టార్ల మేర సాగు చేసిన మినుము పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు.
● గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు డ్రెయిన్ డోకిపర్రులోని పల్లపు చేల రైతులను నట్టేట ముంచింది. ఈ డ్రెయిన్ కింద గ్రామంలో 1,500 ఎకరాల పల్లపు పొలాలు ఉండగా అందులో 500ఎకరాల పైబడి వరి చేలు నీట మునిగింది.
● గన్నవరం మండలంలోని ముస్తాబాదలో 600ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగిందని, బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సీపీఎం కౌలురైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు.
● ఎన్టీఆర్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న వరి పంటలు మొత్తం 300 హెక్టార్లలో మాత్రమే నీటిలో ఉందని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
విరిగిపడిన కొండ చరియలు
భారీ వర్షాలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని మూడో మలుపు వద్ద కొండపై నుంచి ఒకసారిగా మట్టి, చరియలు విరిగి పడ్డాయి. గతంలో మెస్ ఏర్పాటు చేయగా ఈ వర్షాలకు మెస్‌పై పడి, రోడ్డుపై చరియలు పడ్డాయి. కొండ చరియలు విరిగి పడిన ప్రదేశాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఆలయ ఈవో శీనానాయక్, ఈఈ రమా శుక్రవారం ఉదయం పరిశీలించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి ఈవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మునేరుకు పోటెత్తిన వరద..
మునేటికి ఎగువ ప్రాంతాలైన తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలో వర్షాలు పడుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు మునేటిపై పోలంపల్లి ఆనకట్ట వద్ద ఆరున్నర అడుగుల మేర వరదనీరు వస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పెనుగంచిప్రోలు నుంచి లింగగూడెం వెళ్లే రోడ్డులో గండివాగు, అనిగండ్లపాడు వెళ్లే రోడ్డులో కూచివాగు వద్ద చప్టాలపై నీరు ప్రవహించటంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాలకు వరి, మిర్చి పంటలకు ఉపయోగపడినా.. పత్తికి నష్టం కలిగించిందని రైతులు చెబుతున్నారు. శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద మునేరులోకి భక్తులు దిగకుండా గేటు మూసేశారు.
శాంతించిన వరుణుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు మూడు వేల హెక్టార్లలో నీటమునిగిన పంట దుర్గగుడి ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగులకు చేరిన నీటి మట్టం జలమయమైన విజయవాడ రోడ్లు, పొంగిపొర్లిన డ్రెయిన్లు


