చట్టబద్ధంగా ఇద్దరు బాలికల దత్తత | - | Sakshi
Sakshi News home page

చట్టబద్ధంగా ఇద్దరు బాలికల దత్తత

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక దత్తత సంస్థ శిశు గృహం సంరక్షణలో ఉన్న ఇద్దరు బాలికలకు సోమవారం కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో చట్టబద్ధమైన దత్తత ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా బాలికల గుర్తింపు వివరాలు, దత్తత తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు, సంబంధిత ధ్రువపత్రాలు, పత్రికా ప్రకటన, ఇతర అవసరమైన రికార్డులను పరిశీలించారు. దత్తత ప్రక్రియలో అన్ని చట్టపరమైన నిబంధనలు, నిర్దేశిత విధానాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. బాలికల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, నిర్వహించిన వైద్య పరీక్షలు, ఆరోగ్య రికార్డులపై కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలికల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను దత్తత తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు.

బాలికలను ప్రేమతో, బాధ్యతతో పెంచాలి

దత్తత పొందిన తల్లిదండ్రులతో మాట్లాడిన కలెక్టర్‌ బాలికలను ప్రేమతో, బాధ్యతతో పెంచాలని వారికి సూచించారు. వారి ఆరోగ్యం, పోషణ, విద్య, భద్రత, సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాలికలకు సురక్షితమైన, ప్రేమపూర్వకమైన కుటుంబ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. దత్తత అనంతరం బాలికలకు కన్నబిడ్డతో సమానంగా హక్కులు, బాధ్యతలు, కుటుంబ సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ షేక్‌ రుక్సానా సుల్తానా బేగం, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, లీగల్‌ ఆఫీసర్‌ కిరణ్‌ కుమార్‌, శిశు గృహ మేనేజర్‌ దీపిక, సోషల్‌ వర్కర్‌ అరుణ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement