కృష్ణలంక(విజయవాడతూర్పు): సమాజంలో నేటికీ కొనసాగుతున్న కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు నిరసనగా, దళిత కాలనీల సమగ్ర అభివృద్ధి కోసం ఈ నెల 30న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటలకు దళిత ఘోష – సామాజిక శంఖారావం మహాధర్నా నిర్వహించనున్నట్లు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కె.ఆంజనేయులు తెలిపారు. గవర్నర్ పేటలోని బాలోత్సవ్ భవన్‌లో సోమవారం మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని, కుల వివక్ష, అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించి రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే ఈ మహాధర్నాకు దళిత, వ్యవసాయ, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలతో పాటు ప్రజాస్వామికవాదులు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుబ్బరావమ్మ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, వత్తిదారుల సంఘం రాష్ట్ర కో–కన్వీనర్ పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


