అదుపు తప్పిన ట్రావెల్స్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన ట్రావెల్స్‌ బస్సు

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

అదుపు తప్పిన ట్రావెల్స్‌ బస్సు మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరి మృతి కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం కారు ఢీకొని మహిళ దుర్మరణం

రామవరప్పాడు: విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరులో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పింది. విజయవాడ నుంచి రాజాం వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. విజయవాడలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజాం వెళ్తుండగా మార్గమధ్యంలో నిడమానూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిద్ర మత్తులో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పటమట పోలీసులు పేర్కొన్నారు.

గుడివాడ రూరల్‌: మద్యం మత్తులో చోటుచేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టూ టౌన్‌ పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం స్థానిక శోభన కాంప్లెక్స్‌ వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పట్టణంలోని గుడ్‌మెన్‌పేటకు చెందిన వేసపోగు నాగరాజు (40) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దాడికి పాల్పడి హత్య చేసిన వ్యక్తి పట్టణంలోని కొమరగుండ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ హనీష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గంపలగూడెం: కారును బస్సు ఢీ కొనడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన ఊటుకూరులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గంపలగూడెం నుంచి నెమలి వెళ్తోంది. ఊటుకూరు పొట్టి శ్రీరాములు విగ్రహానికి సమీపాన(మలుపు వద్ద) నిలిపి ఉన్న కారును ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభం అక్కడికక్కడే విరిగి పడిపోయింది. దీనితో విద్యుత్‌ వైర్లు తెగి బస్సుపై పడ్డాయి. అదే సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రహదారిపై కార్‌ పార్కింగ్‌ చేయడంతో పాటు రహదారి గుంతలమయంగా ఉండటంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విద్యుత్‌ ఏఈ సీహెచ్‌ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు విరిగిన స్తంభాన్ని, వైర్లను తొలగించి విద్యుత్‌ పునరుద్ధరణ పనులను ఆ శాఖ సిబ్బంది పూర్తి చేశారు.

నందిగామ రూరల్‌: రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొన్న ఘటనలో మహిళ దుర్మరణం చెందిన ఘటన 65వ నంబర్‌ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని అంబారుపేట గ్రామానికి చెందిన వల్లపుదాసు కవిత(45) హోటల్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విధులకు వెళ్లే క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో జాతీయ రహదారిని దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను 108 అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీను చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతురాలి భర్త భాస్కర్‌ నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందగా కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కుమార్తె సుకన్య, పెద్ద కుమారుడు సూర్య కిరణ్‌కు వివాహం కాగా చిన్న కుమారుడు ఉమామహేశ్వరరావు పట్టణంలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement