వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని పిలుపు పెనమలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
ఉయ్యూరు: రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనకు చరమగీతం పాడాలని వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పిలుపునిచ్చారు. ఉయ్యూరు మండలంలోని చిన ఓగిరాలలోని ఓ కన్వెన్షన్‌లో పెనమలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దాసే రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పేర్ని నాని మాట్లాడుతూ కూటమి శ్రేణులే ఛీ అనుకునేలా రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ల దమనకాండను చూసి కమ్మ సామాజిక వర్గం రానున్న ఎన్నికల్లో తిరస్కరించేందుకు సిద్ధపడుతున్నారన్నారు. జిల్లాలో బందరు, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో నీళ్లు లేక నాట్లు వేసుకోలేని దుస్థితిలో రైతాంగం ఉందన్నారు. దేవుడి దయ, భూమాత అనుగ్రహంతో జిల్లాలో కొన్ని చోట్ల బోర్లు ద్వారా సాగు చేస్తున్న దుస్థితి ఉందన్నారు. రైతాంగానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అని మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెంచేసి, ఎరువులను అందకుండా చేస్తూ అన్నదాతలను, సామాన్య ప్రజానీకాన్ని చంద్రబాబు కాల్చుకు తింటున్నాడని ధ్వజమెత్తారు. రైస్‌మిల్లర్లదే రాజ్యంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ధరలకు, చంద్రబాబు పాలనలో ధరలకు బేరీజు వేసుకోవచ్చని సవాల్ చేశారు.
మత విష ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి..
ఎల్లో మీడియా మతం అనే విషాన్ని చిమ్ముతూ వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవాలనే కుట్రలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి తగిన గుణపాఠం నేర్పాలని పేర్ని నాని సూచించారు. ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై చేస్తున్న తప్పుడు విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ధనబలంతో ఓటర్లను ప్రలోభపెట్టి స్థానిక ఎన్నికల్లో గెలవాలనే కుతంత్రాలతోనే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు చేరువగా, సేవాభావం కలిగిన వ్యక్తులను ఎన్నికల్లో పోటీకి సిద్ధం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలపై వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు.
దమ్ముంటే చర్చకు రావాలి : దేవభక్తుని
నియోజకవర్గంలో అభివృద్ధిపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దమ్ముంటే చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి సవాల్ విసిరారు. సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఒక్క ఎకరం భూమైనా పేదలకు పంచారా? అని ప్రశ్నించారు. ఎంత మందికి కొత్త పింఛన్లు ఇచ్చారో ? చెప్పాలన్నారు. ఉయ్యూరులో అతిసారకు ప్రభుత్వ చేతకానితనమే కారణం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బోడెకు ప్రజల సంక్షేమం కంటే కమీషన్లు, సొంత ఆదాయమే ముఖ్యమని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పెడన సమన్వయకర్త ఉప్పాల రాము, పెనమలూరు పరిశీలకులు మీర్ హుస్సేన్, రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, జెడ్పీటీసీ బాకీ బాబు, ముఖ్య నాయకులు జంపాన కొండలరావు, వల్లభనేని వెంకటేశ్వరరావు, మాదు శ్రీహరిరాణి, కె.వెంకటేశ్వరరావు (రాజకీయం), గోన మదన్, నక్కా శ్రీనివాసరావు, సోలే సురేష్‌బాబు, వెంట్రప్రగడ బాబ్జీ, అబ్దుల్లా, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.


