ఇంటికి వస్తున్నానని చెప్పి అనంత లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

ఇంటికి వస్తున్నానని చెప్పి అనంత లోకాలకు..

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

మైలవరం: హాస్టల్‌లో చదువుతున్న కుమారులు ఇంటికి రావడంతో వారికి మాంసం తీసుకువస్తానని చెప్పి వెళ్లిన కొద్దిసేపటిలోనే ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు తోడవడంతో అనంత లోకాలకు వెళ్లాడు తండ్రి. ఆ తండ్రిని చూసి కుమారులు, భార్య రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ విషాదకర సంఘటన మైలవరం మండలం విజయవాడ – భద్రాచలం జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మైలవరం మండలం పుల్లూరు పంచాయతీ శివారు దాసుళ్లపాలెం గ్రామానికి చెందిన గవలపల్లి వెంకటేశ్వరరావు(35) రమణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లోకేష్‌ మైలవరంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు ఆదిశేషు విసన్నపేట మండలం చాట్రాయి ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో కుమారులు ఇంటికి వచ్చారు.

సంఘటనా స్థలంలోనే మృతి..

కుమారులకు మాంసం తీసుకువచ్చేందుకు పుల్లూరు సెంటర్‌కు వెంకటేశ్వరరావు వచ్చాడు. సెంటర్‌లో స్నేహితుని ద్విచక్ర వాహనం తీసుకుని కొత్తగూడెం సెంటర్‌ సమీపంలోని చికెన్‌ షాపులో చికెన్‌ తీసుకుని ఇంటికి వస్తున్నాడు కొంత దూరం వచ్చిన తరువాత చికెన్‌ సరిపోతుందో లేదోనని మరల వెనుతిరిగాడు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిలోని హరీష్‌ హోటల్‌ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వెంకటేశ్వరరావు రహదారిపై కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కొంత సేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ సుధాకర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement