ఇబ్రహీంపట్నం: 10 రోజులుగా ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న పన్నెండేళ్ల మానసిక వైకల్యం గల బాలికను నవజీవన్ బాల భవన్ సభ్యుల ఆధ్వర్యంలోని నీతోడు మానసిక వికాస కేంద్రం సిబ్బంది గుర్తించారు. పోలీసుల సమన్వయంతో బాలల సంరక్షణ గృహానికి ఆదివారం తరలించారు. మానసిక వికాస కేంద్రం ప్రోగ్రామ్ మేనేజర్ గోళ్లమూడి శేఖర్‌బాబు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నానికి చెందిన మానసిక వైకల్యం గల బాలిక తల్లి, అమ్మమ్మ, తాతయ్య మరణించగా, తండ్రి ఎవరో బాలికకు తెలియదన్నారు. 15 ఏళ్ల వయస్సు గల అక్క టెన్త్‌క్లాస్ చదువుతూ బాలిక బాధ్యత చూసుకుంటూ వచ్చింది. 10 రోజుల క్రితం బాలికకు వస్తున్న మానసిక వైకల్య పెన్షన్ రూ.6 వేలు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలను తీసుకుని అక్క ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. దయనీయ పరిస్థితుల్లో ఎవరైనా భోజనం పెడితే తిన్నట్లు లేదంటే పస్తుంటూ బాలిక జీవిస్తుంది. బాలికను సీఐ సుబ్రహ్మణ్యం వద్దకు తీసుకెళ్లి విషయాన్ని వివరించిన అనంతరం ఎస్‌ఐ సత్యవతి ద్వారా విజయవాడలోని బాలల సంరక్షణ గృహానికి తరలించారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె సోదరి ఆచూకీ కనుగొనాలని ఫిర్యాదు చేశారు. జోనల్ కో ఆర్డినేటర్లు సీహెచ్ సాయిబాబు, ఎస్‌కే నజ్మా పాల్గొన్నారు.


