ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్ జి.లక్ష్మీశ
చందర్లపాడు(నందిగామ టౌన్): ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా చందర్లపాడు గ్రామంలోని తునికిపాటి ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి తీసుకున్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రధానంగా రెవెన్యూ, భూ సంబంధిత, పంచాయతీ రాజ్, తదితర శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు వస్తున్నాయని తెలిపారు. ప్రజా సమస్యలపై అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలోకి స్వయంగా వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని చెప్పారు. ముఖ్యంగా సంబంధిత వ్యక్తులతో మాట్లాడి పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని నిబంధనల మేరకు ప్రజలకు అనుకూలంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి అర్జీకి పరిష్కారం చూపటమే కాకుండా భవిష్యత్తులో అదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపటంలో అధికారులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఆర్డీవో అనిల్‌కుమార్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి జ్యోతి, తహసీల్దార్ రామకోటేశ్వరరావు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


