పోలీసుల అదుపులో మరో ఇద్దరు!
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను రవాణా కేసులో నిందితుడైన వెంకట రామాంజనేయులును కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ జె.మురళీకృష్ణ తెలిపారు.
భవనాలు కూల్చేవే..
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని రాజుపాలెంకు చెందిన అలుగు లక్ష్మీనారాయణ పాత భవనాలు కూల్చడం, స్లాబులు పగలగొట్టడం, పునాదులు తీయడం వంటి పనులు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని తమ్ముడు సాయి, మేనల్లుడు గుంజా వెంకట రామాంజనేయులు అతని వద్దే పనిచేస్తుంటారు. రామాంజనేయులు వడ్డేశ్వరంలో ఉంటుండగా, సాయి పెనమలూరు మండలం కానూరులోని మురళీనగర్‌లో ఉంటున్నాడు. భవనాల తొలగింపు పనుల్లో అవసరమైనప్పుడు జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వాడుతుంటారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని లక్ష్మీనారాయణ, రామాంజనేయులు స్వగ్రామానికి వెళ్లారు. కుంట గ్రామంలో లక్ష్మీనారాయణ జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కొనుగోలు చేశాడు. వాటిని బ్యాగ్‌లో పెట్టి సాయికి ఇవ్వాలని వీరాంజనేయులుకు ఇచ్చి వేరే పని మీద వెళ్లిపోయాడు. ఈ నెల 14వ తేదీన అతను శ్రీశైలం నుంచి విజయవాడ బస్సు ఎక్కాడు. అదేరోజు రాత్రి 10గంటల సమయంలో వారధి వద్ద దిగే తొందరలో మరో బ్యాగ్ తీసుకుని బస్సు దిగాడు. అంతటా అతను మురళీనగర్‌లో ఉంటున్న సాయి వద్దకు చేరుకుని బ్యాగ్ తెరిచి చూడగా దుస్తులు ఉన్నాయి. బ్యాగ్ మారిపోయిందని నిర్ధారించుకుని వడ్డేశ్వరంలోని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలు ఉన్న ఒక్క బ్యాగ్ లభించిందని కలకలం రేగింది. పోలీసులు బస్సులో పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయం తెలుసుకున్న రామాంజనేయులు బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
ప్రత్యేక బృందాలతో గాలింపు..
అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో తన మేనమామలైన లక్ష్మీనారాయణ, సాయికి కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు చెప్పాడు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రామాంజనేయులును అరెస్ట్ చూపించి కోర్టులో హాజరు పరిచారు. పోలీసులు లక్ష్మీనారాయణ, సాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచే అవకాశం ఉందని తెలిసింది.


