ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

కోటి రూపాయలకుపైగా ఆస్తి నష్టం

భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక ఆశ్రమం రోడ్‌లోని ఒక ఇంట్లో గురువారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏసీ మెషిన్‌ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐరన్‌ వ్యాపారి వక్కలగడ్డ శ్రీధర్‌కు చెందిన డూప్లెక్స్‌ ఇంట్లో మొదటి అంతస్తులోని చివరి గదిలో ఉన్న ఏసీ ఒక్క సారిగా పేలడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆ సమయంలో ఇంటి యజమాని శ్రీధర్‌, ఆయన తండ్రి షాపునకు వెళ్లిపోగా ఇంట్లో ఉన్న నలుగురైదుగురు అప్రమత్తమై కిందకు వచ్చేయడంతో ఎవరికీ ఏమీ కాలేదు. మొదటి అంతస్తులో ఏసీ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వచ్చి సెకండ్‌ ఫ్లోర్‌లోకి ఎగబాకాయి. అందులోని మొత్తం ఫర్నీచర్‌ దగ్దమైపోయి గోడలు మాత్రం మిగిలాయి. అదే విధంగా పిల్లల కోసం సెకండ్‌ ఫ్లోర్‌లోని ఒక గదిలో ఏర్పాటు చేసిన హోమ్‌ థియేటర్‌లోని వస్తువులన్నీ కాలిపోయాయి.

మూడు గంటలు శ్రమించి..

సమాచారం అందుకున్న కొత్తపేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు దాదాపు మూడు గంటలపాటు శ్రమించారు. అలాగే భవానీపురం పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఉమామహేశ్వరరావు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి యజమాని వక్కలగడ్డ శ్రీధర్‌ ఇటీవలే అయ్యప్ప స్వామి మాల ధరించి మొదటి అంతస్తులో ఏర్పాటు చేసుకున్న పూజ గది (పీఠం)కి ఎటువంటి ప్రమాదం వాటిల్లక పోవడం విశేషం. కాగా ఈ అగ్నిప్రమాదం కారణంగా సుమారు కోటి రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్లు యజమాని శ్రీధర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement