డీఆర్వోకు వినతి పత్రం సమర్పించిన ఏఐవైఎఫ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్హులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల సమర్పణ గడువును మరో 10రోజుల పాటు పొడిగించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) ఎం.లక్ష్మీనరసింహంను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఈ దరఖాస్తులకు ఈనెల 18వ తేదీని చివరి గడువుగా నిర్ణయించిందన్నారు. ఈ కాలంలో వరుసగా పండుగలు, శని, ఆదివారాలు సెలవులు వచ్చాయన్నారు. ఫలితంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం జరిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో దరఖాస్తు గడువును మరో 10రోజుల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. నాయకులు సింగంశెట్టి మోహనప్రసాద్, శీరం రవికుమార్, జి. షైనీ, ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


