ఆర్టీసీ కార్గో నిర్వహణ తీరుపై విమర్శలు మూడు పార్సిల్ కౌంటర్లు ఉన్నా.. పని చేసేది మాత్రం ఒక్కటే మూడు డెలివరీ కౌంటర్లు ఉన్నా.. ఆపరేటర్ మాత్రం ఒక్కరే రోజుకు రూ.లక్ష మేర ఆదాయం తెచ్చిపెడుతున్నా.. నిర్వహణలో నిర్లక్ష్యం
డెలివరీ కౌంటర్‌లో మరింత దారుణం..
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో వస్తువులు పార్సిల్ చేయడానికి, డెలివరీ తీసుకోవడానికి వచ్చిన కస్టమర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కౌంటర్ల వద్ద వారు పడిగాపులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. పార్సిల్ సర్వీస్ కౌంటర్‌లో మూడు కంప్యూటర్లు ఉండగా.. కేవలం ఒక మహిళా ఆపరేటర్ మాత్రమే పని చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం వినియోగదారులు వివిధ ప్రాంతాలకు పార్సిళ్లు పంపడానికి బస్టాండ్‌కు వస్తుంటారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం తమ సహనాన్ని పరీక్షిస్తోందని పలువురు వాపోతున్నారు. పార్సిల్ సర్వీస్ కౌంటర్‌లో ఒక ఆపరేటరే ఉండడంతో పార్సిల్ బుకింగ్‌కు ఎక్కువ సమయం పడుతోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.
థర్డ్ పార్టీ ఏజెన్సీ నిర్వహణలో..
పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో కార్గో సర్వీసు సెంటర్‌ను గుంటూరుకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ప్లాట్ ఫాం 58, 59లలో పార్సిల్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. పార్సిల్ డెలివరీ, ఎంకై ్వరీకి బస్టాండ్‌లోని మినీ థియేటర్ వెనుకవైపు ప్రత్యేక గదులు కేటాయించారు. ఇక్కడి నుంచి రోజువారీ పార్సిళ్లు బుకింగ్ 600 నుంచి 700 వరకు.. వీకెండ్స్‌లో ఆ సంఖ్య కొంచెం పెరుగుతుంది. అలాగే ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్సిళ్లు 2వేల వరకు డెలివరీ ఉంటాయి. అలాగే ట్రాన్‌షిప్‌మెంట్(వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తే.. వాటిని మరో ప్రాంతానికి పంపే)పార్సిళ్లు 1000 వరకు ఉంటాయి. కార్గో సర్వీసుల ద్వారా రోజువారీ రూ.లక్షపైనే ఆదాయం వస్తోంది. వచ్చిన దాంట్లో హమాలీలకు వారు చేసే పనిని బట్టి 30 శాతం, నిర్వహణ ఖర్చులు తీసేసి.. మిగిలిన నెట్ అమౌంట్‌లో కార్గో సర్వీసు నిర్వహిస్తున్న ఏజెన్సీకి 13 శాతం కమిషన్ పోతోంది. మిగిలినది ఆర్టీసీకి జమ అవుతుంది.
డోర్ డెలివరీ విధానం నిలిపివేత..
ఆర్టీసీ బస్టాండ్‌కు పార్సిళ్లను గతంలో డోర్ డెలివరీ చేసే విధానాన్ని అమలు చేశారు. అయితే ఆ విధానం అనుకున్నంత మేర సక్సెస్ కాలేదు. వరుస నష్టాలు రావడంతో ఆర్టీసీ యాజమాన్యం డోర్ డెలివరీ ఆపేసింది. విజయవాడ నుంచి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని బెంగళూరు, సింధనూరు, గంగావతి, బళ్లారి హోసపేట తదితర ప్రాంతాలకు, చైన్నె నగరం, ఒడిశాలోని పర్లాకిమిడి వరకు పార్సిల్ సర్వీసు ఉంది.
మరోవైపు ఆర్టీసీ బస్టాండ్‌లోని డెలివరీ కౌంటర్ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో కస్టమర్లు బారులు తీరుతున్నారు. డెలివరీ విభాగంలో మూడు కౌంటర్లు ఉండగా.. ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. ఆ ఇద్దరిలో కూడా ఒకరు తెలిసిన వాళ్లకు పార్సిల్ ఇచ్చి పంపుతుండగా.. ఒక మహిళా ఆపరేటర్ మాత్రమే అందరికీ పార్సిల్ డెలివరీ కొట్టి ఇస్తున్నారు. దీంతో పార్సిల్ డెలివరీ తీసుకోవడానికి వచ్చిన వేచి ఉండలేక సహనం కోల్పోతున్నారు. పార్సిల్ వెతికి ఇవ్వడానికి టైం పడుతుందని కంప్యూటర్ ఆపరేటర్ చెబుతుండగా.. గంట పాటు వేచి ఉండాల్సి వస్తోందని పలువురు కస్టమర్లు వాపోతున్నారు. బుధవారం సాయంత్రం సైతం బస్టాండ్‌లోని పార్సిల్.. డెలివరీ కౌంటర్ వద్ద జనం బారులు తీరారు. డెలివరీ కౌంటర్ వద్ద సిబ్బంది ఆలస్యంగా స్పందిస్తుండడంపై కొందరు కస్టమర్లు ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


