ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భక్త రామదాసు(కంచర్ల గోపన్న) వారసులు శుక్రవారం దర్శించుకున్నారు. కంచర్ల గోపన్న పదో తరానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు, ఇతర కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జపాన్ లోని ఐచి–నగోయాలో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరుగనున్న 20వ ఆసియా క్రీడలకు తమ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న యలమంచిలి శ్రీకాంత్ సాంకేతిక అధికారిగా ఎంపిక అయ్యారని ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు నక్కల అర్జునరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో కబడ్డీ క్రీడను ప్రోత్సహించడంలోనూ, అభివృద్ధి చేయడంలోనూ విశేష కృషి చేశారని తెలిపారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి, సంయుక్త కార్యదర్శి కె.వి.నాంచారయ్యతో పాటుగా అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్‌ను అభినందించారు.
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెస్టారెంట్లు, ఇతర హోటళ్లపై నిర్వహించిన తనిఖీలపై ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వివరణ కోరింది. ఈ మేరకు విజయవాడ డివిజన్–1, విజయవాడ డివిజన్–2, విజయవాడ డివిజన్–3 జాయింట్ కమిషనర్‌లను ఆయా అంశంపై నివేదికలను కోరినట్లు తెలిసింది. సాక్షి దినపత్రిక ‘తనిఖీలకూ ఉందో లెక్క!’ శీర్షికతో కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దానిపై ఆ శాఖ రాష్ట్ర కార్యాలయం స్పందించి.. ఎందుకు పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. దానిపై మూడు డివిజన్‌ల పరిధుల్లో రెస్టారెంట్లు, హోటల్స్‌పై ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు? ఎంత జరిమానాలు విధించారు? ఎంత వసూళ్లు జరిగాయనే విషయాలను తెలియజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా 2022 నుంచి ఆయా సంస్థల నుంచి రావాల్సిన బకాయి నాలుగైదు కోట్ల మేర ఉన్నట్లు సమాచారం.


