బెజవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ‘రియల్‘ దందా అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు ఫిర్యాదులపై స్పందించని అధికారులు తూతూ మంత్ర చర్యలతో సరి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
అక్రమ లేఅవుట్లు ఇవే...
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో అంతా ఆయన చెప్పిందే వేదం. నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్ వేయాలన్నా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టాలన్నా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి చెబితే సక్రమం అయిపోతుంది. అడ్డ గోలుగా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లకు స్థానిక నేతలు అండదండగా నిలుస్తున్నారు. మామూళ్లు అందుకుంటున్న నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లుగా అక్రమ లేఅవుట్లు వేసేస్తున్నారు. పైగా అర్బన్ ల్యాండ్ సీలింగ్‌లోనో, లేక వివాదాల్లో ఉన్న భూముల్లో సైతం లేఅవుట్‌లు వేసేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయమంతా స్థానిక ప్రజాప్రతి’నిధి‘కి చేరుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూఆర్‌ఆర్‌పేటలో ఐదున్నర ఎకరాల అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమిలో లేఅవుట్ వేశారు. దీనికి స్థానిక తెలుగుదేశం నాయకులు అండదండగా నిలిచారు.
కన్నెత్తి చూడని అధికారులు
ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు అందితే లేఅవుట్ ధ్వంసం చేసినట్లు రోడ్లకు చిన్నచిన్న గోతులు తవ్వి పత్రికలకు నోట్ పంపి ఊరుకుంటున్నారు. మరోవైపు ఎక్స్‌టెన్షన్ ఏరియాలలో అక్రమ లేఅవుట్లతో పాటు, అక్రమ నిర్మాణాలు కూడా తార స్థాయికి చేరుతున్నాయి. సింగ్‌నగర్, పాయకాపురం, గుణదల ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిబంధనలు గాలికి వదిలిపెట్టి స్థానిక రాజకీయ నాయకుల అండతో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మంజూరు అయిన ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు యూనిట్లు, అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. కనీసం సెట్‌బ్యాక్స్ కాని, పార్కింగ్ నిబంధనలు కాని పాటించకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. జీవో 119 ప్రకారం నిబంధనలు పాటించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా అనుమతులకు మించి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కళ్లముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం, ఈ కట్టడాలకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. భవిష్యత్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికై నా టౌన్‌ప్లానింగ్ అధికారులు కళ్లుతెరిచి అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సర్వే నంబర్ 37 లో రెండు ఎకరాలు, సర్వే నంబర్ 78/ఎ1ఎ లోని 3.23 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిండి కేట్‌గా అక్రమ లేఅవుట్లు వేసి విక్రయాలు చేపట్టారు. రోడ్ రోలర్‌లతో రోడ్లు వేసి, ప్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు.


