భూముల రీసర్వేలో రైతుల భాగస్వామ్యం తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వేలో రైతుల భాగస్వామ్యం తప్పనిసరి

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

గన్నవరం: భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రైతులను భాగస్వాములను చేయడంతో పాటు ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ సూచించారు. మండలంలోని కేసరపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ భూముల సర్వే ప్రక్రియ ప్రారంభం నుంచి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా సరిహద్దుల నిర్ణయం వరకు రైతుల సమక్షంలోనే నిర్వహించాలని చెప్పారు. రైతుల చేతికి సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం అందజేసే వరకు వారికి సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. రీసర్వే నిర్వహించిన తర్వాత నోటీసుల రూపంలో రైతులకు చూపించిన భూహద్దులు ప్రకారం భూవివాదాలను తెలియజేయడం, డాక్యుమెంట్లతో సరిపోల్చుకుని నిర్ధారణ జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,800 బృందాలతో అత్యాధునిక రోవర్స్‌తో రీసర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో రీసర్వేలో సమస్యలు ఎదురైతే తక్షణ పరిష్కారం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు 2027 నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నట్లు వివరించారు. జిల్లా సర్వే సహాయ సంచాలకుడు పూజారి లక్ష్మణరావు, తహసీల్దారు కె.వెంకటశివయ్య, గుడివాడ డివిజనల్‌ సర్వే ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాస్‌, మండల సర్వేయర్‌ మాధవరావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

బీఎడ్‌, స్పెషల్‌ బీఎడ్‌ ఫలితాలు విడుదల

కోనేరుసెంటర్‌: కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బీఎడ్‌, స్పెషల్‌ బీఎడ్‌లకు సంబంధించిన రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య కూన రాంజీ మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు ఈ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ వీరబ్రహ్మచారి తెలిపారు. పునఃమూల్యాంకనానికి సంబంధించి దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా వెబ్‌సైట్‌లో సూచించిన రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వ వైద్యులపై నిర్లక్ష్యం తగదు

లబ్బీపేట(విజయవాడతూర్పు): నిరుపేద రోగులకు వైద్యం చేసే ప్రభుత్వ వైద్యుల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ప్రభుత్వ వైద్యుల సంఘం– ఆంధ్రప్రదేశ్‌(జీడీఏ–ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు ఐ.బాబ్జి శ్యామ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ వైద్యుల నిరసన 8వ రోజు మంగళవారం కూడా కొనసాగింది. తమకు 2016 యూజీసీ పీఆర్‌సీ జీతభత్యాల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్బంగా డాక్టర్‌ బాబ్జి శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, పాలిటెక్నిక్‌ కాలేజీ ఫ్యాకల్టీలకు యూజీసీ పీఆర్‌సీ బకాయిలు చెల్లించిన ప్రభుత్వం, ప్రభుత్వ వైద్యుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురు టీచింగ్‌ వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement