గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రతిభకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను జోడించి, గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు ఏఐ వంటి రంగంలో పురోభివృద్ధి సాధించాలని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లను మంగళవారం ఆయన అందజేశారు. రైజ్ కేంద్రంలో ఏఐ 4 అష్యూర్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, తొలి విడతగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొందిన 31 మందిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీ4 స్ఫూర్తితో మార్గదర్శిగా ముందుకొచ్చిన సింటిల్లా డిజిటల్ అకాడమీ సీఈవో కెంబూరు సతీష్ కుమార్ సహకారంతో 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న 31 మందికి సినిమాటిక్ ఏఐ విభాగంలో హైదరాబాద్‌లో ఫుల్‌టైమ్ ఉద్యోగాలు లభించగా మిగిలిన వారికి ఫ్రీలాన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లభించాయన్నారు. ఏఐ కంటెంట్ క్రియేషన్, ఏఐ ఇమేజ్ జనరేషన్, ఏఐ వీడియో క్రియేషన్, ఏఐ వాయిస్ అండ్ ఆడియో, సోషల్ మీడియా మార్కెటింగ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ తదితర నైపుణ్యాలను శిక్షణలో నేర్పించామన్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ ల్యాబ్‌ను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. నూతన మార్కెటింగ్ విధానం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతుందని స్పష్టం చేశారు. సింటిల్లా డిజిటల్ అకాడమీ సీఈఓ కె.సతీష్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, రైజ్ మేనేజర్ బి.తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
సర్టిఫికెట్లు, ఆఫర్ లెటర్లు అందజేసిన కలెక్టర్ జి.లక్ష్మీశ


