అతిసార బాధితులకు మెరుగైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

అతిసార బాధితులకు మెరుగైన వైద్యం

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

ఉయ్యూరులో పర్యటించిన కృష్ణా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ నవీన్‌

ఉయ్యూరు: డయేరియా బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఉయ్యూరు ఏరియా ఆస్పత్రి వైద్యులను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎం. నవీన్‌ ఆదేశించారు. ఆయన ఆదివారం ఉయ్యూరులోని డయేరియా ప్రబలిన ప్రాంతాలతో పాటు బాధితులు చికిత్స పొందుతున్న ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఉయ్యూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో డయేరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డయేరియా లక్షణాలతో మొత్తం 23 మంది రోగులు ఆసుపత్రిలో చేరగా, వారిలో 9 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని వైద్యులు తెలిపారు. అనంతరం ఉయ్యూరు పట్టణంలోని 5వ వార్డు ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.

కమిషనర్‌ గైర్హాజరుపై సీరియస్‌

ఉయ్యూరు మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.సుభాష్‌చంద్రబోస్‌ గైర్హాజరుపై ఇన్‌చార్జి కలెక్టరు నవీన్‌ సీరియస్‌ అయ్యారు. ఉయ్యూరులో డయేరియా విజృంభణ నేపథ్యంలో ఆదివారం రాత్రి విస్తృతంగా పర్యటించిన ఆయన, కమిషనర్‌ పత్తా లేకపోవటంతో ‘మునిసిపల్‌ కమిషనర్‌ ఎక్కడ’ అని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఆయనకు చార్జ్‌మెమో జారీ చేయాలని ఆర్‌డీఓ కరుణకుమారిని ఆదేశించారు.

ఏ లెక్క కరెక్టు సారూ..

ఉయ్యూరులో డయేరియా కేసుల లెక్కల విషయంలో శాఖల మధ్యసమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ జేడీ అర్జునరావు 19 మంది డయేరియా లక్షణాలతో ఉన్నట్లు గుర్తించామని, వీరిలో 15 మంది ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రిలో చేరగా, ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారని, తొమ్మిది మంది ఆసుపత్రిలో ఉన్నారని ప్రభుత్వానికి నివేదిక పంపారు. కాగా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ రాత్రి పర్యటనకు వచ్చిన సందర్భంగా సీహెచ్‌సీలోని వైద్యులు 23 మంది రోగులు ఆస్పత్రుల్లో చేరారని, 9 మంది డిశ్చార్జి అయ్యారని ఆయనకు వివరించారు. అసలు లెక్క ఆ పెరుమాళ్లకే తెలుసు అని పట్టణ వాసులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement