ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్య శ్రీ) పథకం కింద పేదలకు అందుతున్న ఉచిత వైద్య సేవల్లో అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లకు పాల్పడే నెట్‌వర్క్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం ఎన్టీఆర్ వైద్య సేవల సమీక్ష సమావేశం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులపై అందించిన 90 ఆరోపణ కేసులను విచారించారు. విచారణలో 5 ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులపై వచ్చిన ఆరోపణలు వాస్తమని తేలింది. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలకు అపరాధ రుసుము విధించారు. అపరాధ రుసుము విధించిన ఆస్పత్రుల్లో ఇబ్రహీంపట్నం నిమ్రా హాస్పిటల్, తిరువూరు శ్రీ భవానీ హాస్పిటల్, తిరువూరు శ్రీ వైష్ణవి హాస్పిటల్, విజయవాడ ఎంవీఎస్ యాక్సిడెంట్ హాస్పిటల్, విజయవాడ స్మైల్ హాస్పిటల్ ఉన్నాయి.
కఠిన చర్యలు..
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అనేక వ్యాధులకు ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. పథకం పరిధిలో ఉచితంగా అందించాల్సిన సేవలకు రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, అదనపు ఖర్చులకు గురిచేయడం, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించడం హేయమైన చర్యలని పేర్కొన్నారు. పథకం లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే నెట్‌వర్క్ ఆసుపత్రులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఆరోపణలు, ఫిర్యాదులపై నిరంతరం విచారణ జరిపి తప్పులు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ జె. సుమన్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘునందన్, డీఎం అండ్ హెచ్‌ఓ శ్రవణ్ బాబు, డీసీహెచ్‌ఎస్ ఓ. మాధవి దేవి పాల్గొన్నారు.


