క్యాజువాలిటీలో వైద్యం అందక రోగులు విలవిల | - | Sakshi
Sakshi News home page

క్యాజువాలిటీలో వైద్యం అందక రోగులు విలవిల

Aug 20 2026 7:38 AM | Updated on Aug 20 2026 7:38 AM

క్యాజువాలిటీలో వైద్యం అందక రోగులు విలవిల ● నగరానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అస్వస్థతతో క్యాజువాలిటీకి వచ్చాడు. అతనికి సైలెన్‌ పెట్టేందుకు క్యాన్‌లా పెట్టాల్సి వచ్చింది. దీంతో నర్సింగ్‌ విద్యార్థులు, స్టాఫ్‌నర్సులు ఆ రోగికి క్యాన్‌లా పెట్టేందుకు అరగంట పాటు కుస్తీ పట్టారు. చివరికి ఒక వైద్యుడు వచ్చి పెట్టాల్సి వచ్చింది. ● నగరానికే చెందిన సుమారు 17 ఏళ్ల యువతి ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోవడంతో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో క్యాజువాలిటీకి తీసుకు వచ్చారు. ఆమెకు బీపీ చెక్‌ చేయడం, క్యాన్‌లా పెట్టడం అన్నీ నర్సింగ్‌ విద్యార్థులు, ఎంఎన్‌ఓనే చేయాల్సి వచ్చింది. ఇలా అత్యవసర వైద్యం అవసరమైన వారికి సైతం స్టాఫ్‌నర్సులు, నర్సింగ్‌ విద్యార్థులు, ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓల పైనే ఆధార పడవలసి వస్తోంది. కేవలం ఇద్దరు, ముగ్గురు వైద్యులే క్యాజువాలిటీలో ఉంటున్నారు.

నర్సింగ్‌ విద్యార్థులు, ఎంఎన్‌ఓలే పెద్ద దిక్కయ్యారు క్యాన్‌లా పెట్టేది వారే... బీపీ చూసేది వారే... ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రమే రోగుల బాధలు చూడలేకున్నామంటూ కళ్లకు గంతలతో జూడాల నిరసన

వార్డులు ఖాళీ...

తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆఖరి అస్త్రంగా జూడాలు సమ్మెకు దిగారు. తత్ఫలితంగా గత పది రోజులుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందక రోగులు సతమతమవుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా కానరావడం లేదు. జూడాలు, ప్రభుత్వం పంతాల మధ్య రోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.

లబ్బీపేట(విజయవాడ): జూడాల సమ్మె ప్రభావం రోగులపై తీవ్రంగా పడుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయాలతో, తీవ్రమైన అస్వస్థతతో వచ్చిన వారికి క్యాజువాలిటీలో వైద్యం చేయడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. క్యాజువాలిటీలో ఒకరిద్దరు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండటం, రోగులు ఎక్కువగా రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. జూడాలు చేసే పనులను నర్సింగ్‌ విద్యార్థులు, ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓలు చేయాల్సి వస్తోంది. దీంతో వారు క్యాన్‌లా పెట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇటువంటి దయనీయ పరిస్థితులు బుధవారం క్యాజువాలిటీలో కనిపించాయి.

ఇవే నిదర్శనం

పదో రోజు కొనసాగిన జూడాల సమ్మె

జూనియర్‌ వైద్యులు పదోరోజు తమ సమ్మెను కొనసాగించారు. మూడు రోజులుగా అత్యవసర సేవలను సైతం బహిష్కరించిన జూడాలు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోగులు పడుతున్న బాధలు చూడలేకున్నామంటూ కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన దీక్షలో కూర్చున్నారు.

ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తమ స్టైపెండ్‌ పెంచాలని, టీచింగ్‌ వైద్యుల వయస్సు 65 ఏళ్లకు పెంచవద్దని, నాన్‌ మెడికల్‌ వారిని నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లుగా నియమించవద్దని తదితర డిమాండ్‌లతో పది రోజులుగా జూడాలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం లేదు. దీంతో పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

350 మంది విధులు బహిష్కరణ ప్రత్యామ్నాయంగా 21 మందే...

తమ సమస్యల పరిష్కారం కోరుతూ జూనియర్‌ వైద్యులు(హౌస్‌సర్జన్స్‌, పీజీలు) 350 మంది వరకూ విధులు బహిష్కరించి సమ్మె చేస్తుండగా, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా బుధవారం సాయంత్రం వరకూ కేవలం 21 మందిని మాత్రమే ఏర్పాటు చేసింది. వారిలో వైద్య కళాశాల నుంచి 10 మంది, సెకండరీ హెల్త్‌ నుంచి ముగ్గురు, డీహెచ్‌ నుంచి 8 మంది ఇక్కడ విధుల్లో చేరారు.

జూడాలు లేక పోవడంతో ఆరోగ్యం కాస్త కుదుట పడిన రోగులను డిశ్చార్జి చేసేస్తున్నారు. అత్యవసర వైద్యం అవసరమైన వారిని మాత్రమే అడ్మిట్‌ చేసుకుంటున్నారు. దీంతో రోగులు లేక వార్డులు వెలవెలబోతున్నాయి. వార్డుల్లో బెడ్‌లు చాలని పరిస్థితి నుంచి నేడు సగం బెడ్‌లపై కూడా రోగులు ఉండని పరిస్థితి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం బి బ్లాక్‌లోని పాత న్యూరాలజీ వార్డులో ఒక్క రోగి కూడా లేని పరిస్థితి ఉంది. అంతేకాదు అదే బ్లాక్‌ లోని ఏఎంసీలో పది పడకలకు ఇద్దరే రోగులు ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తే జూడాల ప్రభావం ఎంతగా ఉందో అర్ధం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement