లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి జిల్లాలోని ఆస్పత్రులు, క్లినిక్స్, లేబొరేటరీ, దంత వైద్య క్లినిక్స్, స్కానింగ్ సెంటర్‌లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు అన్నారు. ఆయన బుధవారం నగరంలోని పలు స్కానింగ్ సెంటర్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికీ అనుమతులు పొందకుండా ఉన్న ఆస్పత్రులు, క్లినిక్స్ వెంటనే పర్మిషన్, రెన్యువల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి అనుమతి పొందాలన్నారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్ ధరఖాస్తుతో పాటు, ఆ భవన డాక్యుమెంట్, అద్దె అయితే రెంటల్ అగ్రిమెంట్, ఫైర్ ఎన్‌ఓసీ, సేఫ్ ఎన్విరాన్ ఎంఓయూ, పొల్యూషన్ ఎన్‌ఓసీలతో దరఖాస్తు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేని వాటిని గుర్తిస్తే కలెక్టర్ అనుమతితో సీజ్ చేస్తామని హెచ్చరించారు.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి రైల్వే గేటు వద్ద రోడ్డుకు ఇరువైపులా గత 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగించొద్దని ఆ ప్రాంత వాసులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఓ పక్క బాధితులు ఆందోళన చేస్తుండగానే రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చేందుకు పొక్లెయిన్ తీసుకుని రావడంతో అక్కడున్న బాఽధితుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఇద్దరు మహిళలు తమ ఒంటిపై పోసుకున్నారు. ఇళ్లను కూల్చేస్తే నిప్పంటించుకుంటామని హెచ్చరించారు. దీంతో అధికారులు తాత్కాలికంగా పొక్లెయిన్‌ను నిలిపివేశారు.


