ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన దశరథి సుబ్బలక్ష్మి పేరిట కుటుంబ సభ్యులు ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
గోసంరక్షణకు ..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన గోసంరక్షణ పథకానికి ఖమ్మంకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఖమ్మంకు చెందిన గుంటుపల్లి విశ్వేశ్వరరావు, ఊర్మిళ ఇతర కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి గోసంరక్షణకు రూ.1,01,116 విరాళాన్ని అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చదలవాడ యామిని బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జి.గోపీ హైకోర్టు రిజిస్ట్రార్‌గా ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న సీహెచ్ యామినిని కృష్ణాజిల్లా జడ్జిగా నియమించారు.
మొదటి అదనపు
జిల్లా జడ్జిగా శ్రీనివాసశర్మ
మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా వీఎస్‌ఎస్ శ్రీనివాసశర్మ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ స్థానంలో పనిచేసిన జి.సునీత శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మిన్)గా పనిచేస్తున్న శ్రీనివాసశర్మను మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా నియమించారు.
జీడీఏ ఏపీ డిమాండ్
లబ్బీపేట(విజయవాడతూర్పు):బోధనా వైద్యులకు సంబంధించి యూజీసీ పీఆర్‌సీ 2016 బకాయిలను సత్వరమే విడుదల చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబ్జి శ్యామ్‌కుమార్ కోరారు. ఈ మేరకు సంఘ ప్రతినిధులతో కలిసి సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండల రావును కలిసి వినతిపత్రం అందచేశారు. బోధనా వైద్యులకు చట్టబద్ధమైన సేవ, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకుని, వైద్యులకు అనుకూలమైన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మా సమస్యను పట్టించుకోని పక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన, ధర్నా, సమ్మెకు వెళ్లడం వంటివి చేపట్టాల్సి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌ను కలిసిన వారిలో జీడీఏ ఏపీ ప్రతినిధులు డాక్టర్ మహేష్, డాక్టర్ సరళ, డాక్టర్ ఉండవల్లి వంశీకృష్ణ, డాక్టర్ స్వర్ణ గిరీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


