డబ్బుల్లేవ్‌.. బిల్లులు రావ్‌! | - | Sakshi
Sakshi News home page

డబ్బుల్లేవ్‌.. బిల్లులు రావ్‌!

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026 డబ్బుల్లేవ్‌.. బిల్లులు రావ్‌! ● విజయవాడ నగరపాలక సంస్థలో బిల్లుల బకాయి ● రెండేళ్లుగా రూ.400 కోట్లకుపైగా పెండింగ్‌ ● జనవరి నుంచి ఒక్క బిల్లు కూడా ప్రాసెస్‌ కాలేదని ఆరోపణ ● నేటి నుంచి వీఎంసీ కాంట్రాక్టర్లు సమ్మెబాట నిధుల మళ్లింపు!

న్యూస్‌రీల్‌

ఒక్క బిల్లు కూడా ప్రాసెస్‌ చేయలేదు

అందుకే సమ్మె

సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026

పటమట(విజయవాడతూర్పు): ‘రెండేళ్లుగా బిల్లులు రావడం లేదు.. అప్పులు తీసుకువచ్చి పనులు చేస్తున్నాం.. అత్యవసరమైన పనులని అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.. బిల్లుల విషయం వచ్చే సరికి ముఖం చాటేస్తున్నారు’.. ఇది వన్‌టౌన్‌ ప్రాంతంలోని వీఎంసీ కాంట్రాక్టర్‌ వేదన. ‘సీఎం వస్తున్నారని రోడ్డు పనులు చేయించుకున్నారు. బిల్లులు అడిగితే మాటదాటేస్తున్నారు’ ఇది సెంట్రల్‌ నియోజకవర్గంలో ఓ కాంట్రాక్టర్‌ దుస్థితి. ‘రెండేళ్లుగా బిల్లులు ప్రాసెస్‌ చేయటంలేదు.. ఇంట్లో నగలు కుదువ పెట్టి పనులు చేశారు.. తీరా బిల్లుల వ్యవహారంలో కమిషనర్‌ కూడా సరిగ్గా స్పందించటం లేదు’ ఇది తూర్పులో మరో కాంట్రాక్టర్‌ ఆందోళన. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడలో కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఒక్క బిల్లు కూడా ప్రాసెస్‌ చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీఎంసీకి రావాల్సిన స్టాంప్‌డ్యూటీ ట్యాక్స్‌, ఆర్టీఏ నుంచి రావాల్సిన రోడ్‌ ట్యాక్స్‌ తదితర శాఖల నుంచి వచ్చే నిధులను ప్రభుత్వం ఖనాజాకు మళ్లిస్తోందని ఆరోపణ ఉంది. కేవలం బీపీఎస్‌ (బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం) నిధులు, స్ట్రాం వాటర్‌ కోసం కేంద్ర ఇచ్చే నిధులను మాత్రమే వీఎంసీ వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపణ ఉంది. దీనికితోడు వీఎంసీకి వచ్చే ఆస్తి, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, ఖాళీ స్థలాల పన్నులు తదితర మొత్తాన్ని కూడా ప్రభుత్వం జమ చేసుకుంటోందని తెలుస్తోంది. గతంలో బిల్లుల చెల్లింపులో ఇలాంటి స్థితి లేదని, కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా వీఎంసీకి కేంద్ర ప్రభుత్వం స్ట్రాం వాటర్‌ నిర్మాణం కోసం విడుదల చేసిన రూ. 400 కోట్లలో 2014–18 మధ్య నాటి కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.200 కోట్లు నిధులు మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి.

వీఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్లు, రిటైనింగ్‌ వాల్స్‌, వీధి దీపాలు, పార్కులు, యూజీడీ తదితర పనులకు సంబందించి ఇప్పటి వరకు రూ. 400 కోట్లు బకాయిలను వీఎంసీ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. సీఎఫ్‌ఎంఎస్‌ (కాంపెన్సివ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ఇప్పుడది నిధి పోర్టల్‌గా మారింది. దీనిద్వారా వీఎంసీ కాంట్రాక్టర్లకు 2025 డిసెంబర్‌ వరకు 200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు సీ బిల్లులు రూ.40 కోట్లు, 2026 తర్వాత ఏర్పడిన నిధి పోర్టల్‌ల్లో రూ. 200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీఎంసీ సాధారణ నిధుల నుంచి బిల్లుల చెల్లింపులు చేయాలంటే ఇబ్బందిగా మారింది. నెలకు రూ.10 కోట్లు కూడా చెల్లించలేని దుస్థితి ఉంది. వీఎంసీ ఏప్రిల్‌ చివరికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మరోసారి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా అవి కూడా నెరవేరలేదు. నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద ఇప్పటికే పూర్తైన పనులకు రూ.50 కోట్లు, నగరంలో పూర్తి దశకు చేరుకుంటున్న కొనసాగుతున్న పనులకు మరో రూ.50 కోట్లు బిల్లులు జరగాల్సి ఉంది. నగరంలోని కాంట్రాక్టర్లకు సీఎఫ్‌ఎంఎస్‌ స్థానంలో నిధి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి ఒక్క బిల్లు చెల్లింపు కూడా ప్రాసెస్‌ చేయలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిలిపివేస్తున్నాం. రెండేళ్లుగా మాకు బిల్లులు రావడం లేదు. రూ. 350 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై మేం మున్సిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ధ్యానచంద్రను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశాం. కాలయాపన చేస్తున్నారు తప్ప బిల్లులు ఇవ్వడం లేదు. అందుకే సోమవారం నుంచి సమ్మె చేయాలని అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమ్మె నోటీసు కూడా ఇచ్చాం.

– ఆదిబాబు, ప్రధాన కార్యదర్శి, ది విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement