గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యార్థుల్లో జాతీయ భావన, సృజనాత్మకతను పెంపొందించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రైట్ మైండ్స్ సంస్థ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం నగరంలోని బాపు మ్యూజియంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథి కలెక్టర్ లక్ష్మీశ చిత్రలేఖనం పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందిస్తున్న చిత్రాలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో సృజనాత్మక నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దేశభక్తి భావాలను చిత్రాల రూపంలో వ్యక్తీకరించడంతో విద్యార్థుల్లో జాతీయ భావన మరింత బలపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. త్రివర్ణ పతాకం, జాతీయ నాయకులు, స్వాతంత్య్ర స్ఫూర్తి తదితర అంశాలను చిత్రాల ద్వారా ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తమ అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పోటీల్లో సుమారు 250 మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రలేఖనం పోటీలను నాలుగు గ్రూపులుగా నిర్వహించారు. ప్రతి విభాగంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి భావాలను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు.
కలెక్టర్ లక్ష్మీశ


