● పంట కాలువను పూడ్చి
రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు
● నీరు వెళ్లే మార్గం లేక 100
ఎకరాల వరి మాగాణికి ముంపు
● పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా
పరిష్కారం శూన్యం
● బాడవ డొంక రోడ్డుకు అడ్డంగా
గోడ నిర్మాణం
జి.కొండూరు: జిల్లాలో పలుచోట్ల కాలువలపై రియల్టర్ల కన్ను పడింది. దీనికి నిదర్శనం వెలగలేరు పంట కాలువలు. ఇక్కడ కాలువలు లేకుండా చేసి వెంచర్లు వేయడంతో 100 ఎకరాలకు పైగా వరి మాగాణి ముంపునకు గురై రైతులు లబోదిబో అంటున్నారు.
ఆక్రమణ ఇలా..
వెలగలేరు గ్రామ రెవెన్యూ పరిధిలోని కవులూరు రోడ్డుకు ఆనుకొని సర్వే నంబర్లు 264, 265లో గ్రామానికి చెందిన ఓ భూస్వామికి 24ఎకరాల వరకు భూమి ఉంది. దీనికి ఎగువన ఉన్న మాగాణి భూముల్లో అదనపు నీరు పోయేందుకు పూర్వం భూస్వామికి చెందిన భూమిలో నుంచి కాలువ ఉండేది. వెలగలేరు నుంచి కవులూరు రోడ్డు వరకు 2.5కిలోమీటర్లు మేర 45అడుగుల వెడల్పుతో బాడవ డొంక (పుంత) రోడ్డు ఉంది. ఇది కూడా సైతం సదరు భూస్వామి భూమి మధ్యలో నుంచి ఉంది. సదరు భూస్వామి ఈ భూమిలో కొంత మేర ఇటీవల రియల్టర్లకు విక్రయించారు. భూమి విక్రయించిన నేపథ్యంలో అదనపు నీరు పోయేందుకు కాలువ కింద వదిలిన భూమి కూడా రైతులకు లేదని, అది తన సొంత భూమి కనుక కాలువపై హక్కు లేదని చెప్పడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్వం నుంచి ఉన్న కాలువను పూడ్చి ప్రహరీ నిర్మించాడు. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్‌లో ఉన్న బాడవ డొంక రోడ్డుకు రెండు వైపులా ఉన్న పంట కాలువలను సైతం పూడ్చి రోడ్డును మెరక చేసి తారురోడ్డుగా మార్చడంతో సమస్య ఉత్పన్నమైంది. అంతటితో ఆగకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్‌కు ముందు భాగాన అంటే వెలగలేరు, కవులూరు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పెద్ద కాలువను సైతం పూడ్చి చిన్న పైపు వేసి వదిలేయడం విస్మయానికి గురి చేసింది. రియల్టర్‌కు కొంత భూమిని విక్రయించిన సదరు భూస్వామి తన ఆధీనంలో దిగువన ఉన్న భూమిలో బాడవ డొంక రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించడంతో రైతులు వెళ్లలేని పరిస్థితి.
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
ఈ సమస్యపై వెలగలేరు గ్రామానికి చెందిన రైతు సుఖవాసి గోపాలరావుతో పాటు 40మంది రైతులు సంతకాలు చేసి విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జూన్ 22వ తేదీన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన జి.కొండూరు తహసీల్దార్ జులై 9వ తేదీ సిబ్బందితో కలిసి సమస్య ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పొలాల్లో నీరు పోవడానికి కాలువ ఏర్పాటు చేసుకోవాలని రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చెప్పినట్లు, వారు సైతం అందుకు ఒప్పుకున్నట్లు, సమస్య పరిష్కారమైనట్లు ఎండార్స్‌మెంట్ పంపారు. అక్కడ సమస్య అలానే ఉండటంతో మళ్లీ బాధిత రైతులు గత నెల 27న పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అధికారుల వైపు నుంచి స్పందన లేక వరి పొలాలు ముంపునకు గురై పైరు కుళ్లిపోతున్న నేపథ్యంలో రైతులు లబోదిబోమంటున్నారు. బాడవ డొంక రోడ్డుకు అడ్డంగా భూస్వామి నిర్మించిన గోడను సైతం పూర్తిగా తొలగించి రైతుల రాకపోకలు సాగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.


