వైభవంగా సూర్యోపాసన సేవ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సూర్యోపాసన సేవ

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

వైభవంగా సూర్యోపాసన సేవ 12న పోరంకిలో జాబ్‌మేళా ఏపీఎస్పీఎఫ్‌ వాలీబాల్‌ పోటీలు ప్రారంభం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ జరి గింది. లోక కళ్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రతి ఆదివారం అమ్మవారి సన్నిధిలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్యోపాసన సేవ జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి అర్చకులు పూజలు చేశారు. అనంతరం అరుణ పారాయణం, మహా సౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళిని పఠించారు. సూర్య భగవానుడిని ఆరాధించడంతో సంపూర్ణ ఆరోగ్యం.. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

పెనమలూరు: పోరంకిలో ఈ నెల 12వ తేదీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్‌ పి.సురేష్‌కుమార్‌ తెలిపారు. ఆయన ఆదివారం వివరాలు తెలుపుతూ 12వ తేదీ ఉదయం 9.30 గంటలకు పోరంకి బందరు రోడ్డులోని వరుణ్‌మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నెక్సా షోరూమ్‌లో వివిధ విభాగాల్లో మొత్తం 129 పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఏదైన డిగ్రీ, ఇంజినీరింగ్‌ మెకానికల్‌ చదివిన వారు హాజరుకావచ్చని వివరించారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నారు. ఆధార్‌ లింకు ఉన్న ఫోన్‌, పాన్‌, సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలతో రావాలన్నారు. ఎంపికైన వారికి కేటగిరీ ప్రకారం నెలకు జీతం రూ.12 వేల నుంచి రూ.28 వేల వరకు ఇస్తారన్నారు. మరిన్ని వివరాలకు 79813 68429, 96767 08041, 99854 44333, 99892 31431 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో ఆదివారం ఏపీస్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఏపీఎస్పీఎఫ్‌) ఆధ్వర్యాన ఇంటర్‌జోన్‌ వాలీబాల్‌ పోటీలు జరిగాయి. తొలుత పోటీలను ఏపీఎస్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ బీవీ రామిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌ శాఖలో విధులు నిర్వహించడం అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, సమయపాలన అవసరమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా కాకుండా క్రమశిక్షణతో ఆడటం, ప్రత్యర్థిని గౌరవించడం నిజమైన క్రీడా స్ఫూర్తికి నిదర్శనమన్నారు. విధుల్లో నిరంతరం బిజీగా ఉండే పోలీస్‌ అధికారులు, సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని విమానాశ్రయ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. అనంతరం ఇంటర్‌ జోన్‌లో భాగంగా ఏపీ సెక్రటేరియట్‌, ఏపీ హైకోర్టు, ఎన్‌టీటీపీఎస్‌, ఎయిర్‌పోర్ట్‌ యూనిట్‌, విజయవాడ గార్డ్స్‌, హెడ్‌ క్వార్టర్‌ యూనిట్ల మధ్య పోటీలు నిర్వహించారు. టోర్న మెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అసిస్టెంట్‌ కమాండెంట్‌ కె.రమేష్‌ తెలిపారు. విజయవాడ జోన్‌ కమాండెంట్‌ ఎం.శంకరరావు, ఎయిర్‌పోర్ట్‌ సీఎస్‌ఓ కె.ధర్మేంద్ర, పలువురు విమానాశ్రయ, ఎస్పీఎఫ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement