17న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు | - | Sakshi
Sakshi News home page

17న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు

Jun 12 2026 7:31 AM | Updated on Jun 12 2026 7:31 AM

17న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఇద్దరు క్రీడాకారుల ఎంపిక ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్ట్‌

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ సామూహిక అక్షరాభ్యాసాలు జరగనున్నాయి. దీనిపై ఆలయ వైదిక కమిటీ సామూహిక అక్షరాభ్యాసాల నిర్వహణకు నిర్ణయించింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో బుధవారం ఉదయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సుమారు 250 మందితో అక్షరాభ్యాసం చేయించనున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు దేవస్థానం తరఫున ఉచితంగా పలక, బలపం, అమ్మవారి కంకణం, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఈవో శీనానాయక్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బందితో పాటు ఆలయ సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేశారు.

పెనమలూరు: జాతీయ స్థాయిలో జరగనున్న ఫెడరేషన్‌ కప్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేశామని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్‌ తెలిపారు. ఆయన గురువారం కానూరులో వివరాలు తెలుపుతూ సయ్యద్‌ జావీద్‌(57కేజీలు), దుంప వంశీ(75కేజీలు) విభాగంలో ఏపీ జట్టు నుంచి జాతీయ పోటీల్లో పాల్గొంటారని టీఏబీబీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు ప్రకటించారన్నారు. ఈ నెల 12,13,14 తేదీల్లో పంజాబ్‌ రాష్ట్రం లూథియానాలో 15వ ఫెడరేషన్‌ జాతీయ స్థాయి బాడీబిల్డింగ్‌ పోటీలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సంఘ ప్రతినిధులు బి.మనోహర్‌, సీహెచ్‌.రాజు, సభ్యులు అభినందించారు.

21 కేజీల గంజాయి స్వాధీనం

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): నగరంలో అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గద్దె వారి పొలాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సింగ్‌నగర్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. దావు బుచ్చయ్య కాలనీ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సింగ్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ దాడి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది నిఘా పెట్టి దాడులు చేయగా ముగ్గురు రౌడీషీటర్లు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా 21 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితులైన ముగ్గురు రౌడీషీటర్లు అద్దంకి సతీష్‌, కందుల విఘ్నేష్‌, వల్లభనేని సాయి శ్రీరామ్‌ అలియాస్‌ వైఫైలను అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్‌ విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement