అంతర్ జిల్లాల క్రికెట్ చాంపియన్ గుంటూరు
విజయవాడ రూరల్: నున్నలోని గ్రీన్ హిల్స్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. స్కూల్ అండర్–17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలవగా, చిత్తూరు జిల్లా ద్వితీయ, కర్నూలు జిల్లా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు నిర్ణీత ఒవర్లలో 78 పరుగులు చేయగా, చిత్తూరు జట్టు 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుంటూరు జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో కర్నూలు జట్టు కడప జట్టుపై విజయం సాధించింది. కర్నూలు జట్టు 101 పరుగులు చేయగా, కడప జట్టు 68 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ట్రోఫీ, పతకాలు అందజేశారు. ప్రిన్సిపాల్ నక్కనబోయిన గోపాలకృష్ణ, ఎస్‌జీఎఫ్‌ఏపీ అండర్–17 బాలికల అంతర్–జిల్లా క్రికెట్ చాంపియన్‌షిప్ అబ్జర్వర్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


