ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్‌కు పటిష్ట భద్రత
జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోడౌన్‌కు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను చేశామని, అయినా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలతో పాటు మూడు నెలలకు ఒకసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి త్రైమాసిక తనిఖీలు నిర్వహించడంలో భాగంగా బుధవారం విజయవాడ రూరల్ గొల్లపూడిలోని ఏఎంసీ ఆవరణలో గల ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్‌ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరుస్తున్న గోడౌన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో త్రైమాసిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గోడౌన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి(వైఎస్సార్ సీపీ), యేదుపాటి రామయ్య(టీడీపీ), బొంతు కృష్ణారెడ్డి(బీజేపీ), బొర్రా కిరణ్(కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు.


