28న గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్
వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈతరం చిన్నారులకు గ్రీటింగ్ కార్డులకు ఉన్న ప్రాముఖ్యతను తెలియపరచి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే లక్ష్యంతో ఈనెల 28న గ్రీటింగ్ కార్డు డిజైన్ కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో గ్రీటింగ్ కార్డు కాంటెస్ట్ వాల్ పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్క్రీన్ టైంను తగ్గించేందుకు చిన్నారులకు ఇలాంటి కాంటెస్ట్‌లు అవసరమన్నారు. ఈతరం చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతలతో ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పసుమర్తి అమర దీప్తి పాల్గొన్నారు.
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని కాకానినగర్‌లో వరలక్ష్మి అనే యువతి బుధవారం ప్రియుడి ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన వరలక్ష్మి(29), జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ అనే యువకుడు దాదాపు 13 ఏళ్లుగా కలిసి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారడంతో గత ఆరేళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని వరలక్ష్మి చెబుతోంది. ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నామని, సత్యదేవ్ తల్లిదండ్రులు కూడా మా కోడలు నీవే అని పలుమార్లు తనతో చెప్పినట్లు వరలక్ష్మి అంటోంది. అయితే కొంతకాలంగా బాలు సత్యదేవ్ ముఖం చాటేశాడని, అతని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మాటమార్చి తన ప్రియుడిని కనిపించకుండా చేసి, తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని యువతి కోరుతుంది.
27న ప్రభుత్వ పాలిటెక్నిక్
కళాశాలలో జాబ్‌మేళా
గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్‌మేళాలో జోయాలుక్కాస్ జ్యూవెలరీ, వరుణ్ మోటార్స్, ఇన్నోవోర్స్ సర్వీసెస్, అపోలో ఫార్మసీ, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీలు పాల్గొంటాయని జిల్లా ఉపాధి అధికారి, డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి. విక్టర్‌బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్‌కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ.ఫార్మసీ పూర్తిచేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత జాబ్‌మేళాకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా నైపుణ్యం వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా, ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్, పాన్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. ఇతర సమాచారం కోసం 96767 08041, 94940 05725 సెల్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
28న గ్రీటింగ్ కార్డ్ డిజైన్ కాంటెస్ట్


