భక్తి ప్రకాశం.. అరుణోదయం | - | Sakshi
Sakshi News home page

భక్తి ప్రకాశం.. అరుణోదయం

Dec 13 2025 7:23 AM | Updated on Dec 13 2025 7:23 AM

భక్తి

భక్తి ప్రకాశం.. అరుణోదయం

● విజయవాడలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత ● రెండో రోజు కొనసాగిన భవానీ దీక్ష విరమణలు

ఆద్యంతం.. ఆధ్యాత్మిక పరవశం..

విద్యుత్‌ ధగధగలు..

దీక్ష విరమణల సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దుర్గమ్మ ఆలయం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘చల్లంగా చూడు దుర్గమ్మ తల్లి.. మళ్లీ ఏడాది దీక్షతో పిల్లా పాపలను తీసుకుని నీ కొండకు వస్తాం’ అని భవానీలు అమ్మవారిని వేడుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకోగా.. శుక్రవారం సుమారు 80 వేల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 1.15 గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీ దర్శనానికి అనుమతించారు. గురువారం రాత్రి నగరానికి చేరుకున్న భవానీలు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని, క్యూలైన్‌లోనే వేచి ఉండటం కనిపించింది. వేకువజామునే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్న భవానీలు, కొండ దిగువకు చేరుకుని ఇరుముడులను సమర్పించారు. అనంతరం ఇరుముడిలోని నేతి కొబ్బరి కాయను హోమగుండానికి అర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. దీక్ష విరమించిన భవా నీలు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 11 గంటల వరకు భవానీలకు అమ్మవారి దర్శనం కల్పించారు.

నేడు, రేపు కీలకం..

భవానీ దీక్ష విరమణలలో శనివారం, ఆదివారం అత్యంత కీలకమని ఆలయ అధికారులు భావిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారాల నేపథ్యంలో భవానీలు భారీగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆలయ అధికారులు కీలకమైన కేశఖండనశాల, లడ్డూ తయారీలను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం, రాత్రికి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భవానీలకు తోడు నగరానికి చెందిన భక్తులు సైతం గిరి ప్రదక్షిణ చేయనుండటంతో ఆయా మార్గాల్లో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు.

లిఫ్టు కోసం భారీ క్యూ..

సామాన్య భక్తులు లిఫ్టుపై కొండపైకి చేరుకునేందుకు వివిధ మార్గాల ద్వారా మహామండపం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో లిఫ్టు వద్ద భక్తులు బారులు తీరి కనిపిస్తున్నారు. అసలు కనకదుర్గనగర్‌ వైపు నుంచి పోలీసులు భక్తులెవరికి అనుమతించమని చెబుతున్నారు. అయితే వీరు ఏ విధంగా మహా మండపం వద్దకు చేరుకుంటున్నారోనని సెక్యూరిటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. భవానీలతో పాటు సాధారణ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది.

రెండో రోజు ఆదాయం రూ.58.10లక్షలు

భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని రెండో రోజైన శుక్రవారం దేవస్థానానికి రూ. 58.10 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సింగిల్‌ లడ్డూ విక్రయం ద్వారా రూ. 1.09లక్షలు, ఆరు ప్రత్యేక ప్యాక్‌ లడ్డూల విక్రయం ద్వారా రూ.52.20 లక్షలు, కేశఖండన ద్వారా రూ. 4.75లక్షలు, ఇతర ఆదాయం ద్వారా రూ. 5,466 లభించినట్లు పేర్కొన్నారు.

భవానీలు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. కుమ్మరిపాలెం మొదలు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్‌ వరకు పలు ప్రధాన కూడళ్లు, అపార్టుమెంట్లు, భవన సముదాయాల వద్ద పలు భక్త బృందాలు, సేవా బృందాలు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, పండ్లు, ఫలాలను అందిస్తూ సేవలు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో శీనానాయక్‌ గిరిప్రదక్షిణ మార్గంలో బైక్‌పై తిరుగుతూ భవానీలతో మాట్లాడారు. ఇబ్బందులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు.

భక్తి ప్రకాశం.. అరుణోదయం 1
1/2

భక్తి ప్రకాశం.. అరుణోదయం

భక్తి ప్రకాశం.. అరుణోదయం 2
2/2

భక్తి ప్రకాశం.. అరుణోదయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement