ఫలితాల సాధనలో హెచ్‌ఎంల పాత్ర కీలకం
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల ఫలితాల సాధనలో ప్రధానోపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. డీఈఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డెప్యూటీ ఈవో అధ్యక్షత శుక్రవారం మచిలీపట్నం డివిజన్ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం జరిగింది. డీఈఓ మాట్లాడుతూ పాఠశాల స్థాయి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల విద్యారంగ పురోగతి, విద్యార్థుల హాజరు, బోధనా కార్యక్రమాల అమలు, పరీక్షల నిర్వహణ, స్వచ్ఛత, మౌలిక వసతుల మెరుగుదల తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. 10వ తరగతి కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, హామీ ఇచ్చిన ప్రాథమిక–పునాది విద్య, విద్యాశక్తి కార్యక్రమం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా బోధనా వీడియోల వినియోగం వంటి ముఖ్య కార్యక్రమాల అమలుకు సూచనలు చేశారు. మచిలీపట్నం డివిజన్ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
పబ్‌లో అగ్నిమాపకశాఖ తనిఖీలు
పటమట(విజయవాడతూర్పు): గోవాలోని నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది మరణించిన నేపథ్యంలో ప్రజల భద్రతలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నైట్ పబ్‌లలో అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వీఎంసీ ఫైర్ అధికారి మాల్యాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీ శుక్రవారం మొగల్రాజపురం ఐరన్ హిల్ పబ్‌లో జరిగింది. ఈ మేరకు అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అగ్ని నిరోధక పరికరాలను ఉపయోగించే విధానం, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది మంటలను ఎలా ఆర్పాలి, వస్తువులను ఎలా వినియోగించాలి, అగ్ని ప్రమాదం జరగకుండా కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ చర్యలు ఏమేం తీసుకోవాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని వినతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణా శాఖ లో ఉన్న అనేక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని లారీ యజమానుల సంఘ నేతలు శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఎం. రాంప్రసాద్‌రెడ్డిని కలిసి విన్నవించారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన నేతలు ఫిట్‌నెస్ ఫీజుల పెంపు, ఆంధ్రా–తెలంగాణ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల అంశం, కర్ణాటక రిజిస్ట్రేషన్ ట్రైలర్లపై విధిస్తున్న అధిక పెనాల్టీలు, వంటి ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఈశ్వరరావు తెలిపారు. కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘ అధ్యక్షుడు ఎన్. రాజా, ప్రధాన కార్యదర్శి ఏవీవీ సత్యనారాయణ, కార్యదర్శి రావి శరత్, కోశాధికారి ఎన్. కృష్ణ, ట్రైలర్స్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సూరపనేని సురేష్ పాల్గొన్నారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లు, అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు తమ న్యాయవాదులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కై కలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు, మొవ్వ కోర్టుల్లో ఈ లోక్‌అదాలత్ నిర్వహిస్తారన్నారు.
ఫలితాల సాధనలో హెచ్‌ఎంల పాత్ర కీలకం
ఫలితాల సాధనలో హెచ్‌ఎంల పాత్ర కీలకం


