ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేం
విద్యార్థి సంఘాలతో మంత్రి నారా లోకేష్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేమంటూ మంత్రి నారా లోకేష్ చెప్పడంపై విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమై విద్యారంగ సమస్యలపై చర్చించారు. సమావేశంలో పాల్గొన్న ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, పీడీఎస్‌ఓ సంఘాల నేతలు ఎన్నికల హామీలు అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. మంత్రితో సమావేశం అనంతరం విద్యార్థి, యువజన సంఘాల నేతలు విజయవాడ హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేష్‌తో సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలా? అంటూ లోకేష్ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే విషయంలో వెనక్కు తగ్గేదే లేదని మంత్రి తేల్చి చెప్పారన్నారు. ఆరోగ్యశ్రీ అమలు చేయాలంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించక తప్పదన్నారన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్‌లో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి ప్రసన్నకుమార్, పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, పీడీఎస్‌ఓ కోశాధికారి భాను మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిలుపుదల చేయని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి వ్యవహారంలో మంత్రి లోకేష్ పునరాలోచన చేయాలన్నారు. విద్యాసంస్థల్లోకి రాజకీయ పార్టీ జెండాలతో ప్రవేశించకూడదంటూ ఇచ్చిన జీవో 1ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


