చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు
ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేయాలి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ–పీఎన్‌డీటీ) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని, సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏ ఆర్‌టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎ. సత్యానంద్ హాజరైన సమావేశంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరగా విచారించి, తగు చర్యలు తీసుకోవాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని.. చట్టంలోని నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు వైద్య, ఆరోగ్య, సీ్త్ర శిశు సంక్షేమం, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 13 దరఖాస్తులు, 13 రెన్యువల్ దరఖాస్తులు, 19 మార్పుచేర్పుల (మోడిఫికేషన్) దరఖాస్తులను కమిటీ పరిశీలించి, చర్చించి, ఆమోదం తెలిపింది. సరోగసీ కి సంబంధించిన నాలుగు దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. కొత్తగా స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు, రెన్యువల్‌కు, మార్పులు, చేర్పులకు వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే కమిటీకి నివేదించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. గర్భిణులకు ఉపయోగపడే యోగాసనాల పోస్టర్‌ను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, ఆడపిల్లలను రక్షించాలని తెలిపే పోస్టర్లను కూడా కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ, ఎన్‌హెచ్‌ఎం డీపీఎంవో డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.


