కొండెక్కిన పూజా సామగ్రి ధరలు
ఈఓ, ఏసీ, చైర్మన్ ఆదేశాలుప్రకటనలకే పరిమితం దుర్గగుడి దుకాణాల్లో కనిపించని ధరల పట్టికలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలోని దుకాణాల్లో పూజా సామగ్రి ధరలు కొండెక్కాయి. ధరల తగ్గింపుపై ఆలయ ఈఓ, చైర్మన్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని చెబుతున్న దుర్గగుడి అధికారులు, ట్రస్ట్ బోర్డు కార్యవర్గం ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడమే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడికి ఏ అధికారి వచ్చినా, ఎవరు ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నా సామాన్య భక్తులకు ఒరిగింది ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలన్నా ప్రయివేటు దుకాణాల్లోనే కొనుగోలు చేయాల్సివస్తోంది. అయితే ఆ దుకాణాల్లో పూజా సామగ్రి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొబ్బరి కాయ మొదలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువు ధరలైనా ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పూజా సామగ్రిని విక్రయించుకునేందుకు వ్యాపారులకు అనుమతులు జారీ చేస్తుంది. బహిరంగ వేలం ద్వారా దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దేవస్థానానికి అద్దె చెల్లిస్తున్నామనే నెపంతో దుకాణదారులు ఇష్టానుసారంగా పూలు, కొబ్బరి కాయలు, చీరలు, ఆట వస్తువులు ఇలా అవకాశం ఉన్న ప్రతి వస్తువును బహిరంగ మార్కెట్ కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. అయితే దేవస్థానం కొన్నాళ్లగా దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తోందే తప్ప అది ఆచరణలోకి రావడం లేదు.
ఆదేశాలు బేఖాతరు
దుర్గగుడి ఈఓగా బాధ్యతలు స్వీకరించిన శీనానాయక్ తొలి నాళ్లలో గోశాల వద్ద దుకాణాలను పరిశీలించారు. దేవస్థానం నిర్ణయించిన స్థలం కంటే ముందుకు వస్తే చర్యలు తప్పవని, పూజా సామగ్రి ధరలు భక్తులందరికీ తెలిసేలా నెల లోగా ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని లీజెస్ విభాగం అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత జూన్ 18న దుర్గగుడి ఏసీ రంగారావు ఆధ్వర్యంలో లీజెస్ విభాగం మహామండపం ఐదో అంతస్తులోని దుకాణాలతో పాటు గోశాల వద్ద దుకాణాలను తనిఖీ చేసింది. ఏసీ కూడా పూజా సామగ్రితో పాటు ఇతర వస్తువుల ధరలు భక్తులందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థాన ఆదేశాలను భేఖాతరు చేస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ నెల మూడో తేదీన దుర్గగుడి చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు సైతం దుకాణాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ముక్కచీరలతో పాటు భక్తులకు విక్రయిస్తున్న పూజా సామగ్రిని పరిశీలించారు. ధరల పట్టిక ఏర్పాటు చేయలేదా అని దుకాణదారులను ప్రశ్నించారు. బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదే శించారు. అయితే దేవస్థాన ఈఓ, ఏసీ, చైర్మన్ ఇలా ఎంత మంది చెప్పినా వ్యాపారులు ధరల బోర్డులు ఏర్పాటు చేయలేదు. ధరల బోర్డులను ఏర్పాటు చేయాల్సిన ఇంజినీరింగ్ విభాగానికి ఆలయ అధికారులంటే లెక్కలేని తనంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కొండెక్కిన పూజా సామగ్రి ధరలు


