4న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని డిసెంబర్ 4వ తేదీన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 4వ తేదీ తెల్లవారుజామున 5–55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన పూలవాహనంపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉండగా, ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయి ద్యాల నడుమ జరిగే గిరి ప్రదక్షిణలో భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది పాల్గొంటారు.
సాయంత్రం కలశజ్యోతి మహోత్సవం
భవానీ దీక్షలను పురస్కరించుకుని డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం కలశజ్యోతి మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6–30 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి కలశజ్యోతి ఊరేగింపు ప్రారంభమవు తుంది. సత్యనారాయణపురం నుంచి ప్రారంభ మయ్యే కలశజ్యోతి ఊరేగింపు బీఆర్‌టీఎస్ రోడ్డు, లెనిన్ సెంటర్, పాత బస్టాండ్, కంట్రోల్ రూమ్, కెనాల్ రోడ్డు మీదగా కనకదుర్గనగర్‌కు చేరుకుంటుంది. కనకదుర్గనగర్‌లో భవానీలు, భక్తులు కలశజ్యోతులను సమర్పించి మహా మండపం మీదగా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. కలశజ్యోతులను సమర్పించేందుకు కృష్ణా, గుంటూరుతో పాటు ఎన్టీఆర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
పూర్ణాహుతితో ముగిసిన
కార్తిక మాసోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన కార్తిక మాసోత్సవాలు శుక్రవారంతో పరిసమాప్తమయ్యాయి. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. శుక్రవారం నుంచి అర్థమండల దీక్షలు ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు మాలధారణ చేశారు.
భక్తులకు గాజుల పంపిణీ
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం మహిళా భక్తులకు ఆలయ చైర్మన్, ఈవో గాజులను పంపిణీ చేశారు. గత నెల యమ ద్వితీయను పురస్కరించుకుని దుర్గమ్మకు గాజులతో విశేషంగా అలంకరించారు. దేవస్థాన ప్రాంగణంలో అలంకరించిన గాజులను శుక్రవారం భక్తులకు అందజేశారు.


