అమరావతి బాలోత్సవం బ్రోచర్ ఆవిష్కరణ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎనిమిదో అమరావతి బాలోత్సవం బ్రోచర్‌ను బాలోత్సవ్ కమిటీ సభ్యుడు పి.కామేశ్వరరావు అధ్యక్షతన కొండపల్లిలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామేశ్వరరవు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివే సంస్కృతికి బదులు ఇష్టపడి చదివే పరిస్థితులు రావాలన్నారు. బాలోత్సవ్ కమిటీ కార్యదర్శి వెనిగళ్ల మురళీమోహన్ మాట్లాడుతూ.. ఈ బాలోత్సవంలో 43 అకడమిక్‌లు, 17 సాంస్కృతిక విభాగాల్లో 60 రకాల పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీలు డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరుగుతాయని పేర్కొన్నారు. రెండు, మూడు, నాలుగు తరగతుల విద్యార్థులు సబ్ జూనియర్లుగా, ఐదు, ఆరు, ఏడు తరగతుల వారు జూనియర్లుగా, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు సీనియర్లుగా పోటీల్లో తలబడతారని వివరించారు. డిసెంబర్ నాలుగో తేదీలోపు దరఖాస్తులు అందించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 63059 54249 సెల్ నంబరులో సంప్రదించాలని కోరారు. డాక్టర్ మామిడి మోహన రావు, జేవీవీ సభ్యులు పాల్గొన్నారు.


