ఇద్దరు విద్యార్థులను రక్షించిన పోలీసులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు పాఠశాల విద్యార్థులను కృష్ణలంక పోలీసులు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు.. మొగల్రాజపురానికి చెందిన 10, 12 సంవత్సరాల వయసున్న ఇద్దరు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి ఈత కొట్టేందుకు నేరుగా కృష్ణా నది వద్దకు వచ్చారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని శనైశ్వర స్వామి గుడి వద్ద నుంచి కృష్ణానది ఇసుక తిన్నెల్లో నడిచి ఈత కొట్టడానికి ఇద్దరు బాలురు వెళ్తుండగా పోలి పాఢ్యమి సందర్భంగా బీటు విధులు నిర్వహిస్తున్న కాని స్టేబుళ్లు జమేషు, ఎస్.కె.జానీ గమనించారు. హుటాహుటిని వారి వద్దకు చేరుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి వారికి సమాచారం ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


