
క్యూ లైన్ల కోసం ఆర్చ్‌ఫ్రేమ్స్
దసరా ఉత్సవాల కోసం ఏర్పాటు సింహాచలం ఘటన నేపథ్యంలో చర్యలు సీవీ రెడ్డి చారిటీస్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ దృష్టి సారించింది. సింహచలం దేవస్థానంలో స్వామి వారి నిజరూప దర్శనం రోజున గోడ కూలి పలువురు భక్తులు మృతి చెందడం, ఆ తర్వాత సింహచలం గిరిప్రదక్షిణలో భారీ గాలులకు షెడ్డు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల నేపథ్యంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ ఇంజినీరింగ్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై పలు కీలక మార్పులు చేయనున్నారు. గతంలో దసరా ఉత్సవాల సమయంలో ఎదురైన అనుభవాలకు తోడు ఈ రెండు ఘటనల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఆర్చ్‌ఫ్రేమ్స్‌తో క్యూలైన్లు..
దసరా ఉత్సవాలలో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకునేందుకు క్యూలైన్ల ఏర్పాటు చేస్తుంది. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి అమ్మవారి ఆలయం వరకు దేవస్థానం ఐదు లైన్లలో క్యూలైన్లు ఏర్పాటు చేయనుంది. భక్తుల రద్దీని తట్టుకునేలా ఈ క్యూలైన్లను తీర్చిదిద్దేలా మార్పులు చేయనున్నారు. గత ఏడాది వరకు ఈ క్యూలైన్లను ఏర్పాటు చేసేందుకు రోడ్డుపై గోతులు తీసి గడ్డర్లు ఏర్పాటు చేసి, ఆ గడ్డర్లకు ఐరన్ మెస్ బిగించేవారు. రద్దీ సమయంలో ఈ మెస్ భక్తుల చేతులకు, కాళ్లకు గీసుకుని గాయాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతే కాకుండా ఈ క్యూలైన్లపై భాగంలో టార్పాలిన్ పట్టాలు, ప్లాస్టిక్ పట్టాలను కప్పి ఉంచేవారు. భారీ వర్షం, భారీ గాలులు వీచినా ఈ కవర్లు చిరిగిపోయి భక్తులు తడిసి ముద్దయ్యేవారు. అయితే ఈ ఏడాది క్యూలైన్‌లో ప్లాస్టిక్ పట్టాలు కాకుండా ఆర్చ్ ఫ్రేమ్‌లను ఏర్పాటు చేసి వాటి మధ్య క్యూలైన్లను ఏర్పాటు చేసేలా దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సింహచలం దేవస్థానం నుంచి ఈ ఆర్చ్‌ఫ్రేమ్‌లను దుర్గగుడికి తీసుకువస్తున్నారు.
ప్రయోగాత్మకంగా..
దేవదాయ శాఖ ఆదేశానుశారం దుర్గగుడి ఇంజినీరింగ్ విభాగం ఆదివారం సీవీ రెడ్డి చారిటీస్ కాటేజీల వద్ద ప్రయోగత్మకంగా ఈ ఫ్రేమ్‌లతో క్యూలైన్లను ఏర్పాటు చేసింది. వీటిని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ ఈవో పరిశీలించారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దేవదాయ శాఖ కీలక మార్పులు చేసినట్లు ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్చ్‌ఫ్రేమ్ క్యూలైన్ల వల్ల ఎంతటి భారీ గాలులు వీచినా, ఇబ్బందులు ఉండవని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.