మచిలీపట్నంఅర్బన్: కూటమి ఏకపక్ష నిర్ణయాలతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. క్లస్టర్, పాఠశాలల విలీనం వివాదం కొనసాగుతుండగానే మూల్యాంకన పుస్తకాల విధానం పాఠశాలల్లో గందరగోళం రేపింది. పూర్వం పేపర్లపై రాసే పరీక్షలు ఇప్పుడు మూల్యాంకన పుస్తకాలపై రాయడంతో ఉపాధ్యాయులపై పని భారం పెరిగింది. కృష్ణా జిల్లాలో 1,317 పాఠశాలల్లో 81,427 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. తాజాగా జిల్లాలో జరిగిన ఎస్‌ఏ–1 పరీక్షల్లో సిలబస్‌కు సంబంధం లేని ప్రశ్నలు రావడం, ఒకటో తరగతి హిందీ పేపర్ అసంపూర్తిగా ముద్రించడం, ప్రథమ తరగతి పిల్లలకు ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ రాయాలని, మూడో తరగతి వారికి పుస్తక సమీక్ష చేయాలని అడగడం, నాలుగో తరగతి పాఠ్యాంశం నుంచి మూడో తరగతికి ప్రశ్నలు ఇవ్వడం పిల్లలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. విద్యార్థుల స్థాయి, సామర్థ్యాన్ని పట్టించుకోకుండా ప్రశ్నపత్రాలు తయారు చేశారు.
బోధన కంటే ప్రధానంగా పేపర్ వర్క్
పాఠశాలల్లో బోధన క్రమంగా పక్కకు వెళ్తోంది. ప్రస్తుతం ఉపాధ్యాయులకు పేపర్‌వర్క్, ఆన్‌లైన్ అప్‌డేట్లు ప్రధానంగా ఉన్నాయి. పుస్తకం కంటే యాప్ స్క్రీన్‌షాట్లు, విద్యార్థి అభివృద్ధి కన్నా సెల్ఫీ అప్‌లోడ్లకే ప్రాధాన్యం పెరిగింది. ఆన్‌లైన్ అటెండెన్స్, టాస్క్ ట్రాకర్, అసెస్‌మెంట్ రిపోర్టులు, వాట్సాప్ అప్‌డేట్లతో ఉపాధ్యాయులకు సమయం గడిచిపోతోంది. విద్యార్థి కళ్లలోకి చూసి బోధించే అవకాశాలు తగ్గిపోయాయి. బోధనలో అనుభవం లేని వారు విధానాలను రూపొందిస్తున్నారు. గ్రామీణ పరిస్థితులు, పిల్లల స్థాయి, బోధన భాష వంటి అంశాలను పట్టించుకోకపోవడంతో విద్య నాణ్యత దెబ్బతింటోంది.
సెల్ఫ్ అసెస్‌మెంట్ మోడల్‌లో పరీక్షలు
విద్యార్థుల అభ్యసన మదింపునకు ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి. గత ఏడాది నుంచి ఫార్మేటివ్ పరీక్షలను సెల్ఫ్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4 రూపంలో నిర్వహిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి నాలుగు సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి పరీక్షను ఈనెల 11 న నిర్వహించారు. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలు జూన్ 12 న ప్రారంభమైనా పరీక్షలు జూన్ 4 నుంచే జరగాల్సి ఉంది. కానీ అసెస్‌మెంట్ బుక్‌లెట్లు పాఠశాలలకు ఆలస్యంగా చేరుకోవడంతో షెడ్యూల్ వెనక్కి వెళ్లి సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభమయ్యాయి.
పని భారం రెట్టింపు.. నిల్వ సమస్యలు
మూల్యాంకన పుస్తకాల్లోనే మార్కులు నమోదు చేసి, వాటి ఓఎమ్మార్ షీట్స్‌ను విద్యాశాఖ యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో స్కూళ్లలోనే ఏడాది పొడవునా భద్రపరచాలి. ఈ పద్ధతిలో ఒక్కో పాఠశాలలో వందల కొద్దీ పుస్తకాలను భద్రపరచాల్సి పరిస్థితి ఏర్పడింది. గతంలో పరీక్ష పేపర్లను ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి దిద్దేవారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో పుస్తకాలు ఉండటంతో ఇంటికి తీసుకెళ్లి అవకాశం లేక ఇప్పుడు స్కూళ్లలోనే మూల్యాంకనం చేయాల్సి వస్తోంది. నిల్వకు తగిన సదుపాయాలు లేకపోవడంతో వాటి భద్రతపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయులపై అదనపు పనిభారం
మూల్యాంకన పుస్తకాల విధానంతో ఇబ్బంది
పాత పద్ధతినే అనుసరించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
పరీక్షలు జూన్, జూలై సిలబస్‌కు సంబంధించి ప్రశ్నలు రూపొందించారు. పరీక్షలను ప్రత్యేక మూల్యాంకన పుస్తకాలలోనే రాయాలనే నిర్ణయంతో 2వ తరగతికి మూడు, 3 నుంచి 5వ తరగతులకు నాలుగు, 6 నుంచి 7 వ తరగతులకు ఆరు, 8 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ఏడు పుస్తకాలు చొప్పున అందజేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంది. అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వెంటనే ఆచరిస్తుండటంతో విద్యావిధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే క్రమంలో మూల్యంకన పుస్తకాల విధానం ఉపాధ్యాయులపై భారాన్ని పెంచింది. ‘అసెస్‌మెంట్’తో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థ పడుతున్నారు.
అసెస్‌మెంట్ పుస్తకాల విషయంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుంది. ఆరు నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఆరు పుస్తకాలు అందించింది. ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలను వీటిలో రాయాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు మార్కులు ఓఎమ్మార్ షీట్‌లో నమోదు చేసి, విద్యాశాఖ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఈ విధానం బోధనకంటే పరిపాలనా భారం పెంచుతోంది. ప్రభుత్వం ఈ పరీక్షల విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలోనే నిర్వహించాలి.
–అంబటిపూడి సుబ్రహ్మణ్యం,
అధ్యక్షుడు, ఏపీ టీచర్స్ ఫెడరేషన్
ఒకే పుస్తకంలో ఏడాది మొత్తం పరీక్షలు, మార్కులు, ఓఎమ్మార్ డేటా భద్రపరచడం సమయ, స్థల పరమైన ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. పాత పద్ధతే మేలు. బోధనేతర పనులతో అలసిపోయిన ఉపాధ్యాయులపై ఈ కొత్త భారాన్ని మోపడం అన్యాయం. ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలి.
–ఎం.వి. మహంకాళరావు,
వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
విద్యావ్యవస్థలో గందరగోళం!
విద్యావ్యవస్థలో గందరగోళం!